వెంకీ లేని 'దృశ్యం' ఊహించలేమా?
అయితే ఇప్పుడు దర్శకుడు జీతూ జోసెఫ్ దృశ్యం 3 కోసం సన్నాహకాల్లో ఉండగా, మోహన్ లాల్ ఈసారి పాన్ ఇండియా మార్కెట్లో తన సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు కథనాలొస్తున్నాయి.
By: Tupaki Desk | 19 April 2025 5:00 AM ISTమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన దృశ్యం ఫ్రాంఛైజీ చిత్రాల్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడంలో రీమేక్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయా భాషల్లో దిగ్గజ హీరోలు ఈ రీమేక్ వెర్షన్లలో నటిస్తుంటే కోట్లాది రూపాయల వసూళ్లు సాధిస్తున్నాయి. దృశ్యం, దృశ్యం 2 తెలుగు వెర్షన్లలో నటించిన విక్టరీ వెంకటేష్ కు మంచి పేరొచ్చింది. రాంబాబు పాత్రలో అతడు బాగా కనెక్టవ్వడంతో కమర్షియల్ గా బాక్సాఫీస్ కళకళలాడింది.
అయితే ఇప్పుడు దర్శకుడు జీతూ జోసెఫ్ దృశ్యం 3 కోసం సన్నాహకాల్లో ఉండగా, మోహన్ లాల్ ఈసారి పాన్ ఇండియా మార్కెట్లో తన సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు కథనాలొస్తున్నాయి. అంటే ఈసారి దృశ్యం 3 హిందీ వెర్షన్ లో అజయ్ దేవగన్, తెలుగు వెర్షన్ లో వెంకటేష్ కనిపించే అవకాశం ఉండదు. అయితే మోహన్ లాల్ నటించిన వెర్షన్ నే తెలుగు, హిందీ ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తారు? అన్నది చర్చగా మారింది.
దృశ్యం ఫ్రాంఛైజీ థ్రిల్లర్ కాన్సెప్ట్ కాబట్టి హీరోతో పని లేదు అనుకోవడానికి లేదు. తెలుగులో వెంకీకి ఉన్న మార్కెట్, హిందీలో అజయ్ దేవగన్ కి ఉన్న మార్కెట్ మోహన్ లాల్ కి ఉంటుందా? అందుకే పాన్ ఇండియాలో దృశ్యం 3 ని రిలీజ్ చేయాలనుకుంటే, లాల్ స్థాయికి తగ్గ బిజినెస్ మాత్రమే పొరుగు భాషల్లో దక్కుతుంది. అది చాలా చిన్నది అని ట్రేడ్ విశ్లేషిస్తోంది. అలా కాకుండా తెలుగులో వెంకటేష్ నటిస్తే ఆ సినిమాకి 80- 100కోట్ల బిజినెస్ అయ్యేందుకు ఛాన్సుంటుందని కూడా విశ్లేషిస్తున్నారు. అజయ్ దేవగన్ కి హిందీలో పెద్ద మార్కెట్ ఉంది. వాస్తవంగా మేకర్స్ ప్రణాళికలు ఎలా ఉన్నాయో మరింత స్పష్ఠత రావాల్సి ఉంది.
