Begin typing your search above and press return to search.

దృశ్యం 3.. వెంకీ లేకున్నా మనోళ్లు రిసీవ్ చేసుకుంటారా?

మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన దృశ్యం ఫ్రాంచైజీకి తెలుగు ఆడియన్స్ లో కూడా స్పెషల్ క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   11 May 2026 12:15 PM IST
దృశ్యం 3.. వెంకీ లేకున్నా మనోళ్లు రిసీవ్ చేసుకుంటారా?
X

మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన దృశ్యం ఫ్రాంచైజీకి తెలుగు ఆడియన్స్ లో కూడా స్పెషల్ క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. మొదటి రెండు పార్టులు తెలుగులో వెంకటేష్, మీనా కాంబినేషన్‌ లో రీమేక్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ ను దర్శకుడు జీతూ జోసెఫ్ అద్భుతంగా మిక్స్ చేయడంతో కథ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు దృశ్యం 3 విషయంలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది.

మలయాళంలో మోహన్‌ లాల్ హీరోగా రూపొందిన దృశ్యం 3 మే 21న విడుదల కానున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ట్రైలర్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. అయితే తెలుగులో ఈసారి ప్రత్యేక రీమేక్ ఉండదనే వార్తలు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయి. మలయాళ వెర్షన్‌ ను నేరుగా తెలుగు డబ్బింగ్‌ తో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. దీంతో తెలుగు ప్రేక్షకులు ఆ నిర్ణయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనే చర్చ మొదలైంది.

ఇప్పటి వరకు దృశ్యం అంటే తెలుగు సినీ ప్రియులకు ముందుగా గుర్తొచ్చేది వెంకటేషే. ఆయన తన నేచరుల్ యాక్టింగ్ తో ఆ పాత్రకు తెలుగు నేటివిటీని తీసుకొచ్చారు. కుటుంబ పెద్దగా, తన ఫ్యామిలీని రక్షించుకునే వ్యక్తిగా వెంకీ చూపించిన ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేశాయి. అందుకే మూడో భాగంలో కూడా వెంకటేష్ నటిస్తారని చాలా మంది అభిమానులు భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబంతో పాటు, తర్వాత అనిల్ రావిపూడితో మరో సినిమా చేస్తున్నారు. ఆ కారణాల వల్లే దృశ్యం 3 తెలుగు రీమేక్‌పై స్పష్టత రాలేదని తెలుస్తోంది. మరోవైపు హిందీలో అజయ్ దేవగణ్‌ తో దృశ్యం 3 పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాదిలోనే హిందీ వెర్షన్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. కానీ తెలుగులో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.

ముఖ్యంగా ఇప్పుడు ఓటీటీ కాలంలో ఏ భాష సినిమా అయినా ప్రేక్షకులు వెంటనే చూసేస్తున్నారు. మలయాళ, హిందీ వెర్షన్లు విడుదలై ఓటీటీలోకి వచ్చిన తర్వాత తెలుగు రీమేక్ తీసుకొస్తే కొత్తదనం తగ్గిపోతుందని మేకర్స్ భావించి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో మోహన్‌ లాల్‌ కు కూడా తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతంలో ఆయన నటించిన అనేక సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నటన పరంగా మోహన్‌ లాల్‌ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందుకే దృశ్యం 3 డబ్బింగ్ వెర్షన్ ను తెలుగులో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట.

అయితే తెలుగు ఆడియన్స్ దృశ్యం 3ని వెంకటేష్ లేకుండానే అదే రేంజ్ లో ఆదరిస్తారా లేదా అన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది. ఎందుకంటే మొదటి రెండు భాగాల్లో వెంకీ కుటుంబానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు అదే కథను మోహన్‌ లాల్‌ తో డబ్బింగ్ రూపంలో చూడటానికి ప్రేక్షకులు ఎంతవరకు ఆసక్తి చూపిస్తారో చూడాలి. అయితే కంటెంట్ స్ట్రాంగ్ ఉంటే భాష, హీరో అనే తేడాలు పెద్దగా ప్రభావం చూపవన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మరి మే 21న విడుదలయ్యే దృశ్యం 3 తెలుగు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో అంతా వేచి చూడాలి.