దృశ్యం 3 లెక్కలు.. ఇలా జరుగుతుందేంటి?
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో రీసెంట్ మూవీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ ను నమోదు చేస్తోంది.
By: M Prashanth | 25 May 2026 9:00 PM ISTమలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో రీసెంట్ మూవీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ ను నమోదు చేస్తోంది. కేరళలో ఆ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తుండగా.. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కడం లేదు. విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్న ఆ చిత్రం, ఓవర్సీస్ మార్కెట్ లో కూడా దూసుకెళ్తుండటం విశేషం.
మే 21న మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఆ సినిమా, మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్ దాటేసి రికార్డులు సృష్టించింది. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం, మూడో రోజు ముగిసే సమయానికి సినిమా రూ.117 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. మలయాళ ఇండస్ట్రీలో అత్యంత వేగంగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాల్లో ఇది రెండో స్థానంలో నిలిచినట్లు సమాచారం.
ఇండియా బాక్సాఫీస్ విషయానికి వస్తే, సినిమా ఇప్పటివరకు రూ.40 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. మొదటి రోజు కంటే వీకెండ్ లో కలెక్షన్లు పెరగడం నిర్మాతలకు ఊరటనిచ్చింది. ముఖ్యంగా కేరళలో ఆ చిత్రానికి భారీ రెస్పాన్స్ లభిస్తోంది. అక్కడి థియేటర్లలో 65 నుంచి 70 శాతం వరకు ఆక్యుపెన్సీ నమోదవుతుండటంతో అనేక చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. జార్జ్ కుట్టి పాత్రపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ మరోసారి స్పష్టమైంది.
అయితే ఇతర భాషల్లో పరిస్థితి అంతగా ఆశాజనకంగా కనిపించడం లేదు. తెలుగు, తమిళ, కన్నడ వెర్షన్లకు మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు పెద్దగా పెరగడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఓపెనింగ్స్ సరైన స్థాయిలో రాకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. తొలి రెండు భాగాలతో పోలిస్తే ఈసారి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తక్కువగా ఉండటం, కథ నెమ్మదిగా సాగడం ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రధాన విమర్శగా మారింది.
సినిమాపై వచ్చిన రివ్యూలు నెగిటివ్ గా ఉండటం ప్రభావం చూపుతోంది. మొదటి రెండు భాగాల్లో కనిపించిన టెన్షన్, సస్పెన్స్, పోలీస్-ఫ్యామిలీ మధ్య జరిగే మైండ్ గేమ్స్ ఈసారి అంతగా కనిపించలేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దర్శకుడు ఈసారి జార్జ్‌కుట్టి కుటుంబం ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, అతడి నిర్ణయాల ప్రభావం వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. దీంతో సాధారణ ప్రేక్షకులకు సినిమా కాస్త స్లోగా అనిపిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
ఇక ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం సినిమా సత్తా చాటుతోంది. విదేశాల్లోనే దాదాపు రూ.70 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, అమెరికాలో మలయాళ ప్రేక్షకులు భారీగా థియేటర్లకు వెళ్లడం వల్ల కలెక్షన్లు పెరిగాయి. ఆశీర్వాద్ సినిమాస్ నిర్మించిన ఆ చిత్రంలో మీనా, అన్సిబా హాసన్, ఈస్తర్ అనిల్ తమ పాత పాత్రల్లో కనిపించారు. క్లైమాక్స్ లో దృశ్యం 4కు హింట్ ఇవ్వడంతో పాటు, కథను ఇంకా కొనసాగించే అవకాశం ఉందనే చర్చ ఇప్పుడు మొదలైంది.
