మిస్టరీ థ్రిల్లర్ థర్డ్ ఇనిస్టాల్‌మెంట్‌కు లాలిటన్ రెడీ
ఎప్పుడెప్పుడు దృశ్యం 3 పట్టాలెక్కుతుందా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
By: Tupaki Desk | 15 Jun 2025 12:30 AMమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, జీతూ జోసెఫ్‌ల కలయికలో వచ్చిన సస్పెన్స్ ఎమోషనల్ థ్రిల్లర్ 'దృశ్యం'. 2013లో విడుదలై సంచలనం సృష్టించిన ఈ మూవీని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, చైనీస్‌భాషల్లో రీమేక్ చేశారు. రీమేక్ చేసిన అన్ని భాషల్లోనూ ఈ సినిమా రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుని సరికొత్త చరిత్రను సృష్టించింది. కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులతో పాటు ఫిల్మ్ ఫేర్, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్, కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్‌తో పాటు పలు అవార్డుల్ని సొంతం చేసుకుంది.
దీనికి సీక్వెల్‌గా 2021లో 'దృశ్యం 2'ను ఇదే టీమ్ తెరకెక్కించారు. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమాని నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. అయినా సరే ఓటీటీ ప్లాట్ ఫామ్‌లోనూ సీక్వెల్ సంచనల విజయాన్ని సొంతం చేసుకుంది. దీన్ని తెలుగులో వెంకటేష్, కన్నడలో వి. రవిచంద్రన్ హీరోలుగా రీమేక్ చేస్తే ఈ రెండు భాషల్లోనూ ఈ సినిమా విజయం సాధించింది. దీంతో దృశ్యం 3పై అంచనాలు ఏర్పడ్డాయి.
ఎప్పుడెప్పుడు దృశ్యం 3 పట్టాలెక్కుతుందా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దృశ్యం లవర్స్‌కి మేకర్స్ తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు. ఎంపూరన్ 2, తుడరుమ్ చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్లని తన ఖాతాలో వేసుకుని మాంచి జోష్ మీదున్న మోహన్‌లాల్ 'దృశ్యం' థర్డ్ ఇనిస్టాల్‌మెంట్ కోసం రెడీ అవుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ మూవీని సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
త్వరలోనే ప్రొడక్షన్ కంపనీ అ మూవీకి సంబంధించిన అధికారిక అప్ డేట్‌ని ఇవ్వనుందని మాలీవుడ్ టాక్. ఈ మూవీ షూటింగ్‌ని బట్టి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కూడా దృశ్యం 3ని మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇతదిలా ఉంటే గతంలో మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కలయికలో 'రామ్' పేరుతో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. కానీ పూర్తి కాలేదు. ఆగిపోయింది. ప్రస్తుతం మోహన్ లాల్ 'హృదయపూర్వం', వృషభ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.