Begin typing your search above and press return to search.

ప్రేమతో.. మీ డాక్టర్ శ్రీలీల.. ఈ విజయం సులభంగా రాలేదు అంటూ..!

నటి శ్రీలీల తన జీవితంలో ఎంతో ముఖ్యమైన, భావోద్వేగ క్షణాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   13 Feb 2026 8:38 PM IST
ప్రేమతో.. మీ డాక్టర్ శ్రీలీల.. ఈ విజయం సులభంగా రాలేదు అంటూ..!
X

నటి శ్రీలీల తన జీవితంలో ఎంతో ముఖ్యమైన, భావోద్వేగ క్షణాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. శ్రీ లీల తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేసిన ఫొటోలో ఆమె తన గ్రాడ్యుయేషన్ వేడుకలో కనిపించారు. ఆ ఫొటోలో మొత్తం కుటుంబం కలిసి ఉండటం.. ఆ పోస్టును మరింత ప్రత్యేకంగా చేసింది. ముందుగా ఒక పోస్టులో తల్లిని గట్టిగా హగ్ చేసుకుని కనిపించింది శ్రీ లీల. మరో ఫోటోలో తన ఫ్యామిలీ మొత్తం తో కనిపించింది. ఈ హీరోయిన్ ఎన్నో సంవత్సరాల కష్టానికి వచ్చిన ఫలితం ఆ ఒక్క ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.




ఆ ఫొటోతో పాటు శ్రీలీల చాలా మనస్ఫూర్తిగా ఒక క్యాప్షన్ రాశారు. ఈ రోజు తనకు ఒక మైలురాయిలాంటి రోజు అని చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్. ఇది కేవలం డిగ్రీ పొందిన రోజు మాత్రమే కాదు..తన వ్యక్తిగత ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశ అని తెలిపింది. ఈ ప్రయాణంలో నమ్మకం, కన్నీళ్లు, ఓపిక, ధైర్యం అన్నీ ఉన్నాయని ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది.




తన కాలేజీ రోజులు తనకు ఒక ప్రశాంతమైన స్థలంగా మారాయని శ్రీలీల చెప్పుకొచ్చింది. అక్కడ ఎలాంటి ఒత్తిడి లేకుండా తానే తానుగా ఉండగలిగానని.. ఈ విజయం సులభంగా రాలేదని, ఎన్నో సంవత్సరాల కష్టానికి ఫలితమని తెలిపింది. తనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రత్యేకంగా తన కుటుంబం, స్నేహితులు, అలాగే పని సమయంలో తనకు సహకరించినవారికి థ్యాంక్స్ చెప్పారు. పరీక్షల సమయంలో తనకు సమయం ఇచ్చినవారిని, తనను అర్థం చేసుకున్నవారిని మర్చిపోలేమని..తన మీద తానే నమ్మకం పెంచుకుంటున్న సమయంలో తనను నమ్మిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని తెలిపింది శ్రీ లీల. చివరగా గర్వంగా తన పేరు డాక్టర్ శ్రీలీలగా సంతకం చేసి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది ఈ హీరోయిన్.

ఆరు సంవత్సరాల పాటు నటనతో పాటు వైద్య విద్యను కొనసాగించి డిగ్రీ పూర్తి చేయడం నిజంగా గొప్ప విషయం. షూటింగ్స్, ప్రయాణాలు, చదువు, పరీక్షలు అన్నీ సమతుల్యం చేస్తూ ముందుకు సాగారు. అభిమానులు ఆమె క్రమశిక్షణకు, పట్టుదలకు ప్రశంసలు కురిపిస్తున్నారు.

2001లో జన్మించిన శ్రీలీల, బెంగళూరులో పెరిగారు. వైద్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆమె, సినిమాల్లో బిజీగా ఉన్నా చదువును వదల్లేదు.