Begin typing your search above and press return to search.

టాప్ స్టోరీ: డోన్ట్ అండ‌రెస్ట్ మేట్ సీనియ‌ర్స్

కానీ సినిమా రంగంలో మాత్రం సీనియ‌ర్స్ అంటే రిటైర్ మెంట్..వారి వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌ల్లో చూపించ‌డం..క్ర‌మ క్ర‌మంగా వారి క్రేజ్‌ని త‌గ్గించ‌డం..వారి క్రేజ్‌ని అండ‌రెస్ట్‌మేట్ చేయ‌డం అనేది క‌నిపిస్తుంటుంది

By:  Tupaki Desk   |   9 Oct 2023 3:30 PM GMT
టాప్ స్టోరీ: డోన్ట్ అండ‌రెస్ట్ మేట్ సీనియ‌ర్స్
X

ఏ రంగంలో అయినా సీనియ‌ర్‌ల‌కు ప్రాధాన్య‌త‌నిస్తుంటారు. అనుభ‌వ‌జ్ఞ‌లైన వారు ఉంటేనే బాగుంటుంది అని చెబుతుంటారు. కానీ సినిమా రంగంలో మాత్రం సీనియ‌ర్స్ అంటే రిటైర్ మెంట్..వారి వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌ల్లో చూపించ‌డం..క్ర‌మ క్ర‌మంగా వారి క్రేజ్‌ని త‌గ్గించ‌డం..వారి క్రేజ్‌ని అండ‌రెస్ట్‌మేట్ చేయ‌డం అనేది క‌నిపిస్తుంటుంది. అయితే కొంత మంది సీనియ‌ర్ స్టార్ హీరోలు మాత్రం డోన్ట్ అండ‌రెస్ట్ మేట్ సీనియ‌ర్స్ అంటున్నారు. మంచి క‌థ‌, క‌థ‌కు త‌గ్గ ద‌ర్శ‌కుడు కుద‌రాలే కానీ బాక్సాఫీస్ వ‌ద్ద లేటు వ‌య‌సులోనూ వండ‌ర్స్ క్రియేట్ చేస్తామ‌ని నిరూపిస్తున్నారు. వారిపై అందిస్తున్న స్పెష‌ల్ స్టోరీ మీ కోసం.

'విక్ర‌మ్‌' బ్లాక్ బ‌స్ట‌ర్‌తో స‌మాధానం...

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ 'విశ్వ‌రూపం' త‌రువాత ఆ స్థాయి స‌క్సెస్‌ని సొంతం చేసుకోవ‌డానికి నాలుగేళ్లు ప‌ట్టింది. ఈ సినిమాతో అనేక స‌వాళ్ల‌ని ఎదుర్కొన్న క‌మ‌ల్ డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్ల బెదిరింపుల‌ని కూడా చ‌వి చూడాల్సి వ‌చ్చింది. అన్నింటిని అధిగ‌మించి సినిమాని థియేట‌ర్ల‌లోకి తీసుకొచ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్‌ని సొంతం చేసుకున్నారు. అయితే ఈ సినిమా త‌రువాత క‌మ‌ల్ వ‌రుస ఫ్లాపుల‌ని చూశారు. వ‌య‌సు పెరగ‌డం, స‌రైన క‌థ‌ల‌ని ఎంచుకోక‌పోవ‌డంతో ప్రేక్ష‌కుల‌కు, క‌మ‌ల్‌కు మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డింది.

దీంతో ఎలాంటి సినిమాతో మ‌ళ్లీ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవాలి? అని ఎదురు చూస్తున్న వేళ 1986లో ఆయ‌న న‌టించిన యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ 'విక్ర‌మ్‌'కు కొన‌సాగింపుగా 'విక్ర‌మ్‌'ని చేశారు. లోకేష్ క‌న‌గ‌రాజ్ త‌న సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో భాగంగా తెర‌కెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచి క‌ల్ట్ సినిమాల్లో స‌రికొత్త ఒర‌వ‌డిని సృష్టించి మ‌ళ్లీ క‌మ‌ల్‌ని స‌క్సెస్ ట్రాక్‌లోకి తీసుకొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రూ.400 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురి చేసింది. ఈ సినిమా అందించిన ఉత్సాహంతో 'ఇండియ‌న్ 2', హెచ్ వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో KH 233, మ‌ణిర‌త్నంతో KH 234ల‌ని లైన్‌లో పెట్టారు.

ర‌జ‌నీ 'జైల‌ర్‌' ప్ర‌భంజ‌నం అంతా ఇంతా కాదు...

సూప‌ర్ స్టార్ రజ‌నీకాంత్ బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్‌ని సొంతం చేసుకుని దాదాపు 13 ఏళ్ల‌యింది. శంక‌ర్ తెర‌కెక్కించిన 'రోబో' సినిమా తమిళ‌, తెలుగు, హిందీ భాష‌ల్లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. భారీ గ్రాఫిక్స్ హంగుల‌తో హాలీవుడ్ రోబోటిక్ సినిమాల‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో శంక‌ర్ ఈ మూవీని రూపొందించిన తీరు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుని కాసుల వ‌ర్షం కురిపించింది. అయితే ఆ స్థాయిలో ర‌జ‌నీ స‌క్సెస్‌ని అందు కోవ‌డానికి ప‌ద‌మూడేళ్లు ప‌ట్టింది. వ‌రుస ఫ్లాపుల‌తో త‌న ఫామ్‌ని కోల్పోయిన ర‌జ‌నీ కెరీర్ ప‌రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వ‌య‌సు మీద‌ప‌డుతుండ‌టం..అనారోగ్యం వంటి స‌మ‌స్య‌ల‌తో త‌న స్థాయికి త‌గ్గ క‌థ‌ల‌పై దృష్టి పెట్ట‌ని ర‌జ‌నీ వ‌రుస ఫ్లాపుల్ని చూశారు.

ఇదే స‌మ‌యంలో ఆయ‌న కెరీర్‌పై కామెంట్‌లు వినిపించాయి. ఇక ర‌జ‌నీ మేనియా ముగిసిన‌ట్టేనా?.. ఆయ‌న మార్కు సినిమాలు చూడ‌లేమా? అని. అదే స‌మ‌యంలో ఆయ‌న‌ని ఎలా చూపిస్తే ఫ్యాన్స్‌కు పూన‌కాలు వ‌స్తాయో అదే పంథాలో తెర‌కెక్కిన సినిమా 'జైల‌ర్‌'. పూర్తి స్థాయిలో చూపించ‌క‌పోయినా ర‌జ‌నీ మేన‌రిజ‌మ్స్‌ని ప‌క్కాగా ప్ర‌జెంట్ చేయ‌డం, అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోవ‌డంతో 'జైల‌ర్‌'కు అభిమానులు, ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఏకంగా రూ.600 కోట్ల మేర కాసులు కురిపించి ర‌జ‌నీ మేనియాకు తిరుగులేద‌ని నిరూపించారు. ఇది అందించిన‌ జోష్‌తో ర‌జ‌నీ 'త‌లైవ‌ర్ 170', లోకేష్ క‌న‌గ‌రాజ్‌తో క్రేజీ కాంబినేష‌న్‌లో త‌లైవ‌ర్ 171ని లైన్‌లో పెట్టారు.

'జీరో'తో జీరో అంటే 'ప‌ఠాన్‌'తో...

బాలీవుడ్‌లో మ‌రీ ముఖ్యంగా ఇండియ‌న్ సినిమాల్లో రొమాంటిక్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ స‌క్సెస్ కోసం నాలుగేళ్లు ఎదురుచూడాల్సి వ‌చ్చింది. రొమాంటిక్ ల‌వ్ స్టోరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్న షారుక్ ఆ ఫార్ములా సినిమాల నుంచి బ‌య‌టికి వ‌చ్చి కొత్త‌గా ప్ర‌య‌త్నాలు చేయ‌డం మొద‌లు పెట్టారు. అలా చేసిన 'జీరో' బ్లాక్‌బ‌స్ట‌ర్ అవుతుంద‌ని భావిస్తే భారీ డిజాస్ట‌ర్‌గా నిలిచి షాక్ ఇచ్చింది. ఐదు ప‌దులు దాటి 60కి చేరువ అవుతున్న తాను ఎలాంటి సినిమా చేస్తే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారనే అంతఃర్మ‌ధ‌నం షారుక్‌లో మొద‌లైంది. ఇదే స‌మ‌యంలో త‌న‌యుడు డ్ర‌గ్స్ కేసులో ఇరుక్కోవ‌డంతో షారుక్ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారింది. అన్ని విధాలుగా డౌన్‌లో ఉన్న షారుక్ ఈ సారి క‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్ట‌క త‌ప్ప‌దు అనే కామెంట్‌లు వినిపించాయి. అదే స‌మ‌యంలో షారుక్ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'ప‌ఠాన్‌'తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. బాయ్‌కాట్‌, బ్యాన్ వంటి విమ‌ర్శ‌లు, స‌వాళ్ల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన 'ప‌ఠాన్‌' బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్‌ల దుమ్ము దులిపింది.

బాక్సాఫీస్ వ‌ద్ద ఊహించ‌ని విధంగా రూ.1000 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. దీని త‌రువాత వ‌చ్చిన 'జ‌వాన్‌' కూడా అంత‌కు మించి రాబ‌ట్టి బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు రూ.1,160 కోట్లు రాబ‌ట్టింది. త్వ‌ర‌లో 'డంకీ' సినిమాతో షారుక్ రాబోతున్నారు. ఇది కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. కార‌ణం అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌కుడిగా పేరున్న రాజ్ కుమార్ హ‌రాణీ ఈ సినిమాని రూపొందించారు. డిసెంబ‌ర్ 22న విడుద‌ల కానున్న ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే షారుక్ హ్యాట్రిక్ ని సాధించి స‌రికొత్త రికార్డుని న‌మోదు చేయ‌డం ఖాయం. క‌మ‌ల్ 'ఇండియ‌న్ 2'తో మ‌రో మ్యాజిక్‌కు రెడీ.. త‌లైవ‌ర్ 170, లోకేష్ క‌న‌గ‌రాజ్‌తో 171 ప్రాజెక్ట్‌ల‌తో ర‌జ‌నీ బాక్సాఫీస్‌ని షేక్ చేయ‌డానికి సిద్ధం అవుతున్నారు. 60 టు 70 కి చేరువ అవుతున్న సీనియ‌ర్ స్టార్స్ 400 కోట్ల నుంచి 1000 కోట్లు కొల్ల‌గొడుతూ స్టార్ల‌కు స‌వాల్ విసుతుండ‌టం విశేషం.