పర్మిషన్ లేకపోతే చర్యలు తప్పవు.. రీమేక్ కాదంటున్న డైరెక్టర్
1980లో రిలీజైన అమితాబ్ బచ్చన్, శశి కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన దో ఔర్ దో పాంచ్ సినిమాపై సోహమ్ రాక్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పబ్లిక్ నోటీస్ జారీ చేయడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసింది.
By: Sravani Lakshmi Srungarapu | 16 Feb 2026 9:00 PM ISTబాలీవుడ్ చిత్రసీమలో క్లాసిక్ మూవీ రైట్స్ అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. 1980లో రిలీజైన అమితాబ్ బచ్చన్, శశి కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన దో ఔర్ దో పాంచ్ సినిమాపై సోహమ్ రాక్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పబ్లిక్ నోటీస్ జారీ చేయడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసింది. సోహమ్ రాక్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ తమ ప్రకటనలో, ఆ సినిమాకు సంబంధించిన పూర్తి నెగటివ్ కాపీరైట్స్ తమవేనని స్పష్టంచేసింది.
హక్కులన్నీ తమకే సొంతమంటున్న సోహమ్ రాక్‌స్టార్
అలాగే, దో ఓర్ దో పాంచ్ మూవీకి సంబంధించిన అన్ని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మరియు అనుబంధ హక్కులపై తమ ఒక్కరికే అధికారం ఉందని తెలిపింది. ఈ రైట్స్ కేవలం ఒరిజినల్ సినిమాకే పరిమితం కాకుండా, దాని ఆధారంగా రూపొందించబడే రీమేక్‌లు, సీక్వెల్‌లు, ప్రీక్వెల్‌లు, ఇతర భాషల్లో తీసే అడాప్షన్స్ అన్నీ తమ అనుమతితోనే చేయాలని హెచ్చరించింది.
పర్మిషన్ లేకుండా వాడితే చర్యలు తప్పనిసరి
అవి మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లు, స్టేజ్ షోలు, కామిక్స్, నవలల రూపంలో రూపొందించే అన్ని డెరివేటివ్ కంటెంట్ పై కూడా తమ హక్కులు వర్తిస్తాయని సోహమ్ రాక్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థ స్పష్టం చేసింది. తమ పర్మిషన్ లేకుండా ఎవరు ఆ కంటెంట్ ను వాడినా, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని నిర్మాణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది.
దో ఔర్ దో పాంచ్ నుంచి ఇన్‌స్పైర్ అయి గోల్‌మాల్5
క్లాసిక్ సినిమాలపై చట్టపరమైన అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. రీసెంట్ గా రోహిత్ శెట్టి తెరకెక్కించనున్న గోల్‌మాల్5 గురించి వస్తున్న వార్తలతో ఈ ప్రకటనకు మరింత ప్రాముఖ్యత లభించింది. ఈ మూవీ కోసం అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ ను ప్రధాన పాత్రల్లో తీసుకోవాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మూవీ దో ఔర్ దో పాంచ్ కథాంశం నుంచి ఇన్‌స్పైర్ అయి రూపొందిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.
వార్తల్ని ఖండించిన రోహిత్ శెట్టి
రోహిత్ శెట్టి పిక్చర్స్ ఈ ప్రచారాన్ని ఖండిస్తూ, గోల్‌మాల్5 సినిమాకూ, దో ఔర్ దో పాంచ్ కూ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కాగా రోహిత్ శెట్టికి గతంలో సక్సెస్, ఫ్లాపులు కూడా ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చాయి. సింబా, సూర్యవంశీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించగా, తర్వాత వచ్చిన సర్కస్ తీవ్ర విమర్శలు ఎదుర్కొని ట్రోలింగ్ కు గురైంది. ఈ నేపథ్యంలో ఆడియన్స్ ఇప్పుడు మరింత ఒరిజినాలిటీని ఆశిస్తున్నారు. పాత సినిమాలపై ఆధారపడి తీసే సినిమాలపై ఆడియన్స్ కూడా ఆసక్తి చూపించడం లేదు. మొత్తానికి సోహమ్ రాక్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ తీసుకున్న ఈ స్ట్రిక్ట్ డెసిషన్ క్లాసిక్ సినిమాల హక్కులు ఎంత కీలకమో గుర్తు చేస్తోంది.
