3000 కోట్ల ఫిలింసిటీకి భూమి పూజ.. బిజినెస్‌మేన్ షాక్‌లు!
డ్యూన్ పార్ట్ 2, ఓపెన్ హైమర్ వంటి సంచలన చిత్రాలకు VFX అందించిన DNEG కంపెనీ ప్రతిష్ఠాత్మక `రామాయణం` సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 7 May 2025 9:00 AM ISTడ్యూన్ పార్ట్ 2, ఓపెన్ హైమర్ వంటి సంచలన చిత్రాలకు VFX అందించిన DNEG కంపెనీ ప్రతిష్ఠాత్మక `రామాయణం` సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ కథానాయకుడిగా నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి, సన్నీడియోల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేజీఎఫ్ యష్ ఈ చిత్రంలో రావణుడిగా నటించడమే గాక, డిఎన్ఇజీ- ప్రైమ్ ఫోకస్ తో కలిసి సినిమాని నిర్మిస్తున్నాడు.
ఆసక్తికరంగా డిఎన్ఇజి కంపెనీ మహారాష్ట్ర ప్రభుత్వంతో గతంలో స్టూడియో నిర్మాణం కోసం భారీ ఒప్పందం(ఎంవోయు) కుదుర్చుకుంది. దాదాపు 3000 కోట్ల పెట్టుబడులతో ముంబైలో 200 ఎకరాల్లో భారీ ఫిలింసిటీని నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫిలింసిటీకి ఈ ఏడాది చివరిలో భూమి పూజ చేస్తారని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ ఫిలింస్టూడియో కాన్సెప్ట్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. స్టూడియోని పూర్తిగా రామాయణం నేపథ్యంలో సెటప్ తో నిర్మిస్తారట. రామాయణం నేపథ్య వినోద ఉద్యానవనం, హోటళ్ళు, నివాస వసతి సహా పూర్తి వినోద పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఇది 2,500 మందికి ఉపాధి అవకాశాలను అందిస్తుంది. ఈ ప్రాజెక్టు ఈ సంవత్సరం చివర్లో ప్రారంభమవుతుందని తెలుస్తోంది.
ముంబైలో జరిగిన వేవ్స్ 2025 సమ్మిట్ సందర్భంగా ప్రైమ్ ఫోకస్ వ్యవస్థాపకుడు నమిత్ మల్హోత్రా తన విజన్ గురించి మాట్లాడారు. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న రామాయణం చిత్రాన్ని ప్రపంచస్థాయి ఆడియెన్ కోసం రూపొందిస్తున్నామని తెలిపారు. అలాగే రామాయణంలో వీఎఫ్ఎక్స్ వర్క్ మరో లెవల్లో ఉంటుందని, పురాణేతిహాసానికి విజువల్ గా జవజీవాలు తెస్తున్నామని తెలిపారు. ముంబైలో స్టూడియో నిర్మాణానికి సహకరిస్తున్న సీఎం ఫడ్నవిస్ ని నమిత్ మల్హోత్రా ప్రశంసించారు. డూన్ పార్ట్ 2 చిత్రంలో వీఎఫ్ ఎక్స్ కి ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న నమిత్ మల్హోత్రా ఆ తర్వాత భారీ ప్రాజెక్టులను ప్రారంభిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నితీష్ తివారీ `రామాయణం`లో రాముడిగా రణబీర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. రామాయణం చిత్రాన్ని రెండు భాగాలుగా అతడు తెరకెక్కిస్తున్నారు.
