డీజే టిల్లు క్రెడిట్ గొడవపై దర్శకుడి క్లారిటీ
ఐతే డీజే టిల్లు కోసం విమల్ కూడా చాలా కష్టపడ్డాడని.. కానీ అతడికి క్రెడిట్ రాలేదని.. దీంతో తన కెరీర్ దెబ్బ తిందని ఇండస్ట్రీలో చర్చ నడిచింది గతంలో.
By: Garuda Media | 28 March 2026 10:05 AM ISTడీజే టిల్లు సినిమాకు దర్శకత్వం వహించిన విమల్ కృష్ణ.. ఆ తర్వాత దాని సీక్వెల్ టిల్లు స్క్వేర్‌లో లేడు. డీజే టిల్లు సక్సెస్ క్రెడిట్ అంతా హీరో సిద్ధు జొన్నలగడ్డకే వెళ్లిపోగా.. దాని సీక్వెల్ టిల్లు స్క్వేర్ విషయంలోనూ అదే జరిగింది. ఆ చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకోగా.. మల్లిక్ రామ్ మెగా ఫోన్ అందుకున్నాడు. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయినా మల్లిక్‌కు కూడా ఏం క్రెడిట్ రాలేదు. మళ్లీ సిద్ధు ఖాతాలోకే ఘనతలన్నీ వెళ్లిపోయాయి. రేప్పొద్దున టిల్లు క్యూబ్ వచ్చినా ఇదే పరిస్థితి ఉండొచ్చేమో.
ఐతే డీజే టిల్లు కోసం విమల్ కూడా చాలా కష్టపడ్డాడని.. కానీ అతడికి క్రెడిట్ రాలేదని.. దీంతో తన కెరీర్ దెబ్బ తిందని ఇండస్ట్రీలో చర్చ నడిచింది గతంలో. విమల్ ఇన్నేళ్ల తర్వాత రాగ్ మయూర్ హీరోగా అనుమాన పక్షి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషనల్ ప్రెస్ మీట్లో డీజే టిల్లు క్రెడిట్ వివాదం గురించి అతడికి ప్రశ్న ఎదురైంది.
దీనికి విమల్ చాలా కూల్‌గా సమాధానం ఇచ్చి ఈ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశాడు. డీజే టిల్లు స్క్రిప్టు తాను, సిద్ధు కలిసి రాశామని.. అందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేదేమీ లేదని అతను స్పష్టం చేశాడు. సక్సెస్ క్రెడిట్ ఎవరిది అనే విషయంలో తాను కానీ, సిద్ధు కానీ స్పందించలేదు అంటే.. అక్కడసలు వివాదమే లేదని అర్థం అని విమల్ అన్నాడు. వివరణ ఇవ్వాల్సిన అవసరమే లేనపుడు తామిద్దరం ఎందుకు మాట్లాడాలని అతను ప్రశ్నించాడు.
తాను ఆ సినిమా రైటింగ్‌లో 50 శాతం క్రెడిట్ తీసుకుంటే.. ఇంకో సగం సిద్ధుకు వెళ్తుందని.. సిద్ధు కూడా ఇదే చెబుతాడని.. కాబట్టి డీజే టిల్లు సక్సెస్ క్రెడిట్ ఎవరిది అనే విషయంలో ఏమైనా వివాదం ఉంటే ఈ రోజుతో అది తొలగిపోవాలని విమల్ స్పష్టం చేశాడు. బయటి వాళ్లు ఏదేదో అనుకోవడమే తప్ప.. విమల్ అయితే డీజే టిల్లు సక్సెస్ క్రెడిట్ అంతా సిద్ధుకు వెళ్లిపోయిందనే ఫీలింగ్‌లో ఏమీ లేడని తన వ్యాఖ్యలను బట్టి స్పష్టమైనట్లే. మరి అనుమానపక్షితో మంచి హిట్ కొట్టి తనేంటో అతను రుజువు చేసుకుంటాడేమో చూడాలి.
