Begin typing your search above and press return to search.

సెన్సార్ అవసరమే లేదా? 'పెద్ది' దివ్యేందు అభిప్రాయమేంటి?

సినిమాలకు సెన్సార్ అవసరమేంటని ప్రశ్న ఆయన ముందుకు తీసుకురావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

By:  M Prashanth   |   26 May 2026 4:00 PM IST
సెన్సార్ అవసరమే లేదా? పెద్ది దివ్యేందు అభిప్రాయమేంటి?
X

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న వేళ, బాలీవుడ్ యాక్టర్ దివ్యేందు శర్మ కామెంట్స్.. ఇప్పుడు సినీ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారాయి. సినిమాలకు సెన్సార్ అవసరమేంటని ప్రశ్న ఆయన ముందుకు తీసుకురావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది చిత్రంలో దివ్యేందు కీలక పాత్ర పోషిస్తున్నారు. జూన్ 4న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్స్‌ లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో దివ్యేందు శర్మ సెన్సార్ సిస్టమ్ పై తన అభిప్రాయాన్ని క్లియర్ గా వెల్లడించారు.

'18 ఏళ్లకు ఓటు హక్కు ఇస్తున్న దేశం.. అదే యువతకు ఏ సినిమా చూడాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఇవ్వకపోవడం ఎందుకు?' అంటూ ప్రశ్నించారు. ప్రజలకు సరైన అవగాహన ఉన్నప్పుడు సినిమాల విషయంలో కంట్రోల్ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. కళ అనేది సమాజానికి అద్దం పట్టేదని, సినిమాలో కనిపించే అనేక అంశాలు వాస్తవ జీవితంలోనూ ఉన్న సమస్యల ప్రతిబింబమేనని చెప్పారు.

సమాజంలో జరుగుతున్న కఠిన వాస్తవాలు చూపించడం వల్ల చర్చ మొదలవుతుందని, వాటిని పూర్తిగా దాచిపెట్టడం సరైన పద్ధతి కాదని ఆయన వ్యాఖ్యానించారు. 'సినిమాలో కొన్ని సన్నివేశాలు అసౌకర్యంగా అనిపిస్తే, వాటి మూలాలు సమాజంలోనే ఉన్నాయని అర్థం చేసుకోవాలి. సమస్యను సినిమాలో కాకుండా సమాజంలో మార్చాల్సిన అవసరం ఉంది' అని దివ్యేందు అన్నారు.

ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఓటీటీ కంటెంట్‌ పై ఆయన ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు. డిజిటల్ ప్లాట్‌ ఫారమ్‌ లు టాలెంట్ కు పెద్ద వేదికగా మారాయని, అక్కడ కథలు స్వేచ్ఛగా చెప్పే అవకాశం ఉండటం వల్ల కొత్త తరహా కథలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. ఓటీటీకి ప్రత్యేక సెన్సార్ అవసరం లేదని, ప్రేక్షకులే ఏది చూడాలో నిర్ణయించుకుంటారనేది ఆయన భావన.

అయితే దివ్యేందు కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మాత్రం సమర్థిస్తున్నారు. సినిమాలు, వెబ్ సిరీసులు కేవలం వినోదం మాత్రమే కాకుండా సమాజంలో ఉన్న వాస్తవాలను చూపించే సాధనమని చెబుతున్నారు. క్రియేటివిటీ ఫ్రీడమ్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు, కంప్లీట్ ఫ్రీడమ్ డేంజర్ అని మరికొందరు అంటున్నారు. ముఖ్యంగా వైలెన్స్ సీన్స్, అసభ్య పదజాలం, మతపరమైన అంశాలు లేదా చిన్నారులపై ప్రభావం చూపే కంటెంట్ విషయంలో నియంత్రణ అవసరమేనని అంటున్నారు. ఓటీటీ వేదికల ద్వారా ఎలాంటి కంటెంట్ అయినా ఈజీగా అందుబాటులోకి వస్తోందని, అందువల్ల కనీస రూల్స్ ఉండాలని సూచిస్తున్నారు.

ప్రస్తుతం ఇండియాలో థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు సెన్సార్ అనుమతి తప్పనిసరి. కానీ ఓటీటీ కంటెంట్ మాత్రం నేరుగా సెన్సార్ పరిధిలో లేదు. దీంతో క్రియేటివిటీ ఫ్రీడమ్, సామాజిక బాధ్యతల మధ్య బ్యాలెన్స్ ఎలా ఉండాలనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఇక పెద్దితో దివ్యేందు టాలీవుడ్‌ లో ఎలాంటి గుర్తింపు సంపాదిస్తారో చూడాలి. కానీ మూవీ రిలీజ్ కు ముందే ఆయన చేసిన కామెంట్స్ మాత్రం సెన్సార్ వ్యవస్థపై కొత్త చర్చకు దారి తీశాయి.