దలైలామాతో దివ్యా దత్ స్ఫూర్తిదాయక భేటీ!
ఈ అమూల్యమైన ఆలోచనను తాను జీవితాంతం హృదయంలో మోస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు.
By: Srikanth Kontham | 9 Jun 2026 9:00 PM ISTపీస్ ఆఫ్ మైండ్ కోసం అప్పుడప్పుడు సెలబ్రిటీలు బిజీ షెడ్యూల్ అంతా పక్కనబెట్టి ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లిపోతుంటారు. తాజాగా బాలీవుడ్ నటి దివ్యాదత్ హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన పర్వత ప్రాంతమైన ధర్మశాలకు విహారయాత్రకు వెళ్లారు. సాధారణ సెలవుదినంగా సాగాల్సిన ఆ ప్రయాణం ఆమె జీవితంలో ఎప్పటికీ మరువలేని ఓ సరికొత్త ఆధ్యాత్మిక ..మానసిక పరివర్తనకు దారితీసింది. అక్కడ ఆమెకు లభించిన ప్రత్యేక అవకాశం ఆమె ఆలోచనా సరళిని పూర్తిగా మార్చివేసింది. టిబెటన్ బౌద్ధ గురువు, శాంతికి ప్రతిరూపమైన పరమపూజ్య దలైలామాను ఆమె ధర్మశాలలో మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సమావేశం ఆమెపై ఎనలేని ప్రభావం చూపింది. దలైలామా వంటి గొప్ప వ్యక్తిత్వమున్న మహానుభావుని సమక్షంలో గడపడం తనను మానసికంగా ఎంతో కదిలించిందన్నారు. అది కేవలం ఒక కలయిక మాత్రమే కాదని.. అద్భుతమైన అంతర్గత అనుభవమని ఆమె ఎంతో భావోద్వేగంతో పంచుకున్నారు. తాను కేవలం ఒక సాధారణ పర్యాటకురాలిగా ధర్మశాల వెళ్లానని.. కానీ అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు గొప్ప జీవిత పాఠాన్ని మూటగట్టుకుని వచ్చానన్నారు. బాహ్య ప్రపంచంలో మనం ఎంత వెతికినా దొరకని నిజమైన ప్రశాంతత, కేవలం మన అంతరంగంలోనే ఉంటుందని, దానిని మనమే స్వయంగా పెంపొందించుకోవాలని దలైలామా ప్రబోధించిన తీరు ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ అమూల్యమైన ఆలోచనను తాను జీవితాంతం హృదయంలో మోస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు. అలాగే దివ్యా దత్తా వృత్తిపరమైన జీవితంలోనూ ఎంతో విజయవంతంగా దూసుకుపోతున్నారు. ఆమె నటించిన చారిత్రాత్మక పీరియడ్ డ్రామా `ఛావా` ప్రేక్షకులను ఎంతగానో అలరించిందో తెలిసిందే. దీంతో పాటు ఓటీటీ వేదికగా విడుదలైన `చిరయ్యా` అనే సరికొత్త వెబ్ సిరీస్‌లో కూడా అమ్మడు అద్భుతమైన నటనతో డిజిటల్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. `చిరయ్యా` వెబ్ సిరీస్‌కు లభిస్తున్న స్పందన పట్ల హర్షం వ్యక్తం చేశారు.
కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా సామాజికంగా ఎంతో లోతైన చర్చలకు దారితీసే కథాంశంతో ఈ సిరీస్ రూపుదిద్దుకుంది. ప్రేక్షకులు ఈ కథతో ఎంతగానో కనెక్ట్ అవుతున్నారని వీక్షించడమే కాకుండా సామాజిక మాధ్యమాలలో తమ సొంత అనుభవాలను కూడా పంచుకుంటూ చర్చలు జరపడం ఒక నటిగా తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని దివ్యా దత్తా అన్నారు. ప్రస్తుతం దివ్యాదత్ కొత్తగా కమిట్ అయిన చిత్రాలంటూ ఏవీ లేవు. కొన్ని సినిమాల్లో అవకాశాలు వస్తున్నా? సెలక్టివ్ గా ఉంటున్నారు. ఇప్పటికే వయసు 48 రావడంతో? ఆ వయసు ఆధారంగా పాత్రలను ఎంచుకుంటున్నారు. గత ఏడాది తెలుగులో రిలీజ్ అయిన `మయసభ` అనే వెబ్ సిరీస్ లో కూడా దత్ నటించిన సంగతి తెలిసిందే.
