Begin typing your search above and press return to search.

డెవిల్ గోల.. వాళ్ళకు కనిపించట్లేదా?

టాలీవుడ్ లో గత రెండు రోజులుగా డెవిల్ సినిమా డైరెక్టర్ విషయమై వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   28 Dec 2023 11:20 AM GMT
డెవిల్ గోల.. వాళ్ళకు కనిపించట్లేదా?
X

టాలీవుడ్ లో గత రెండు రోజులుగా డెవిల్ సినిమా డైరెక్టర్ విషయమై వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్ హీరోగా నవీన్ మేడారం దర్శకత్వంలో 'డెవిల్' సినిమాని స్టార్ట్ చేశారు. కొంత షూటింగ్ అయిన తర్వాత డైరెక్టర్, ప్రొడ్యూసర్ మధ్య ఇగో కారణాలతో డైరెక్టర్ ని తప్పించి దర్శకుడిగా నిర్మాత అభిషేక్ నామా తనకు తాను క్రెడిట్ ఇచ్చుకున్నాడు.

సినిమా కోసం దాదాపు 105 రోజులు షూటింగ్ చేసిన ఓ దర్శకుడికి క్రెడిట్ ఇవ్వకుండా కేవలం ప్యాచ్ వర్క్ చేసిన నిర్మాత దర్శకుడిగా మారడం బహుశా టాలీవుడ్ హిస్టరీ లో ఇదే మొదటిసారి కాబోలు. దర్శకుడి పనితీరు నచ్చకపోతే అతన్ని తీసేసి హక్కు నిర్మాతకు ఉంది. కానీ అతని క్రెడిట్ లాక్కునే అధికారం నిర్మాతకే కాదు ఎవ్వరికి లేదు. ఇదివరకు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ 'మణికర్ణిక' సినిమా విషయంలో ఇదే జరిగింది.

ఈ సినిమా షూటింగ్ టైంలో డైరెక్టర్ క్రిష్ కి కంగనాకి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి. దాంతో క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి పక్కకు తప్పుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సన్నివేశాలను కంగనా స్వయంగా దర్శకత్వం వహించింది. అయితే టైటిల్ కార్డ్ లో కంగనాతో పాటు క్రిష్ పేరు కూడా కనిపించింది. కానీ డెవిల్ విషయానికొస్తే దర్శకుడికి ఏమాత్రం క్రెడిట్ ఇవ్వలేదు. నవీన్ కూడా ఈ విషయంలో బాధపడ్డాడు. కోర్టు కేసులు, లీగల్ నోటీసుల జోలికి వెళ్ళను అంటూనే తన కష్టం వృధా అయిందని బాధపడ్డాడు.

డెవిల్ విషయంలో ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. ఇందులో తప్పు ఎవరిదైనా కావచ్చు కానీ దర్శకుడిగా నవీన్ కు రావలసిన క్రెడిట్ రావాల్సిందే. మరి ఈ విషయంలో దర్శకుల సంఘం మౌనంగా ఉండడం మరిన్ని అనుమానాలకు దారి తీస్తోంది. ఇలాంటి సిచువేషన్ లో కూడా దర్శకుల సంఘం స్పందించకపోవడం గమనార్గం. డైరెక్టర్ నవీన్ మేడారం కంప్లైంట్ చేయలేదు కాబట్టి మేం కూడా రెస్పాండ్ అవ్వలేదని సర్ది చెప్పుకోవచ్చు.

కానీ ఓ దర్శకుడికి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వలేదని నవీన్ బాహాటంగానే చెబుతుంటే మేమున్నామంటూ దర్శకుల సంఘం ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే కదా ఇలాంటి వ్యవస్థలపై అందరికీ నమ్మకం కలిగేది. మరి ఇప్పటికైనా దర్శకుల సంఘం ఈ వివాదంపై నోరు విప్పుతుందేమో చూడాలి.