ప్రివ్యూ వేళ బ్రెయిన్ స్ట్రోక్.. 'బ్రహ్మాండ' దర్శకుడి మృతి
సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ప్రివ్యూను చూస్తుండగా.. ఈ మూవీ డైరెక్టర్ సండ్రు నగేష్ అలియాస్ రాంబాబుకు బ్రెయిన్ స్ట్రోక్ రావటం తెలిసిందే.
By: Tupaki Desk | 10 July 2025 9:45 AM ISTటాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం తెలంగాణ జానపద కళారూపమైన ఒగ్గు కథ నేపథ్యంలో తీసిన 'బ్రహ్మాండం' మూవీ ప్రివ్యూ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించటం తెలిసిందే. సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ప్రివ్యూను చూస్తుండగా.. ఈ మూవీ డైరెక్టర్ సండ్రు నగేష్ అలియాస్ రాంబాబుకు బ్రెయిన్ స్ట్రోక్ రావటం తెలిసిందే.
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కుప్పకూలిపోయిన 47 ఏళ్ల రాంబాబును హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తొలుత అపోలో ఆసుపత్రికి తర్వాత నిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం అర్థరాత్రి వేళలో కన్నుమూశారు. ఆయనకు భార్య సరిత ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మెదక్ జిల్లా శివ్వం పేట మండలం అల్లీపూర్ నివాసి. ఆయన అంత్యక్రియల్ని బుధవారం పూర్తి చేశారు.
సుదీర్ఘ సినీ కెరీర్ రాంబాబు సొంతం. దాదాపు 150 సినిమాలు.. 60 సీరియళ్లకు సహాయ దర్శకుడిగా వ్యవహరించిన ఆయన.. కొన్ని సినిమాలకు దర్శకుడిగా పని చేశారు.తన తాజా సినిమా ప్రివ్యూ వేళ.. బ్రెయిన్ స్ట్రోక్ కు గురి కావటం.. చికిత్స పొందుతూ కన్నుమూయటం సినీ వర్గాల్ని షాక్ కు గురి చేసింది. అదే సమయంలో సుదీర్ఘ కెరీర్ ఉన్న ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి.. చికిత్స కోసం అపోలో నుంచి నిమ్స్ కు తరలి వెళ్లటాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉన్నప్పటికీ.. రాంబాబుకు అండగా నిలిస్తే ఏమయ్యేదన్న మాట వినిపిస్తోంది.
