Begin typing your search above and press return to search.

సెన్సార్ కు సూటి ప్ర‌శ్న స‌మాధానం ఉందా?

రిలీజ్ కు ముందు ఏ సినిమాకైనా సెన్సార్ త‌ప్ప‌నిస‌రి. సినిమాలో ఏవైనా అభ్యంత‌రాలుంటే అక్క‌డే వ్య‌క్త‌మ‌వుతాయి.

By:  Tupaki Desk   |   15 May 2025 7:50 AM
సెన్సార్ కు సూటి ప్ర‌శ్న స‌మాధానం ఉందా?
X

రిలీజ్ కు ముందు ఏ సినిమాకైనా సెన్సార్ త‌ప్ప‌నిస‌రి. సినిమాలో ఏవైనా అభ్యంత‌రాలుంటే అక్క‌డే వ్య‌క్త‌మ‌వుతాయి. వాటికి క‌ట్ విధిస్తుంది సెన్సార్. అభ్యంత‌రం లేక‌పోతే ఎలాంటి క‌ట్స్ లేకుండా స‌ర్టిఫై అవుతుంది. అయితే ఇదే సెన్సార్ పై చాలా ర‌కాల ఆరోప‌ణ‌లున్నాయి. ఈ విష‌యంలో ఓసారి విశాల్ ఏకంగా చ‌ట్ట ప‌రమైన చ‌ర్య‌ల‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. ముంబై సెన్సార్ బోర్ట్ లో త‌న‌కెదురైన అనుభ‌వాన్నిచెబుతూ చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించాడు.

దీంతో ప్ర‌భుత్వ‌మే రంగంలోకి దిగి ఓ క‌మిటీ కూడా వేసింది. ముంబై సెన్సార్ లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నా య‌న్న ఆరోప‌ణ పై రాష్ట్ర ప్ర‌భుత్వం సీరియ‌స్ గా తీసుకుని చ‌ర్య‌ల‌కు దిగింది. ఇంకా త‌వ్వితే సెన్సార్ పై చాలా ర‌కాల ఆరోప‌ణ‌లు తెర‌పైకి వ‌స్తుంటాయి. తాజాగా `మ‌ల్లేశం` డైరెక్ట‌ర్ రాజ్. ఆర్ కూడా తెలుగు సెన్సార్ నుంచి త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌న్న‌ట్లుగా ఆరోపించారు.

ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `23` ఈనెల 16 న‌రిలీజ్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ రెడీగా ఉన్న చిత్ర ప్ర‌మోష‌న్ లో భాగంగా సెన్సార్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన చిల‌క‌లూరి పేట‌, చండూరు, జూబ్లీహిల్స్ కారు బాంబు పేలుడు సంఘ‌ట‌న‌ల‌తో ముడిప‌డిన క‌థ ఇది. ఎన్నో స‌వాళ్ల మ‌ధ్య ఈ సినిమా పూర్తి చేసానన్నారు. `ఒక ద‌ర్శ‌కుడిగా ఎలాంటి విష‌యాన్ని ఎంత సున్నితంగా చెప్పాలో నాకు తెలుసు.

హింస వ‌ద్దే అనే భావ‌న క‌లిగించేలా ఈ సినిమా చేసాను. అయినా స‌రే సెన్సార్ బృందం నుంచి చాలా స‌మ‌స్య‌ల్ని ఎదుర్కోవాల్సి వ‌చ్చంద‌న్నారు. చాలా సినిమాల్లో చూపించిన స‌న్నివేశాలు..సంభాష‌ణ‌లు మా సినిమాలో ఉన్నాయి. అప్పుడు వాటికి సెన్సార్ క‌త్తెర వేయ‌లేదు...కానీ మా సినిమాలో వాటికి క‌త్తెర వేసారు. మా క‌థ న్యాయ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌శ్నించిన‌ట్లుగానే ఒక్కో ద‌ర్శ‌కుడికి ఒక్కో నిబంధ‌న దేనికి? సెన్సార్ ముందు అంద‌రూ స‌మాన‌మే క‌దా? అని ప్ర‌శ్నించారు. మ‌రి వీటికి సెన్సార్ స‌మాధానం ఇస్తుందా? లేదా? అన్న‌ది చూడాలి.