ఆంధ్ర కింగ్ తాలూకా.. డైరెక్టర్ మహేష్ బాబు గెలిచింది అక్కడే!
అభిమాని అంటే కేవలం ఈలలు, గోలలు, పేపర్ ముక్కలు మాత్రమే కాదు.. వాడి గుండెల్లో ఒక బరువైన ఎమోషన్ కూడా ఉంటుందని నిరూపించాడు దర్శకుడు మహేష్ బాబు పి.
By: Tupaki Desk | 29 Nov 2025 1:56 PM ISTఅభిమాని అంటే కేవలం ఈలలు, గోలలు, పేపర్ ముక్కలు మాత్రమే కాదు.. వాడి గుండెల్లో ఒక బరువైన ఎమోషన్ కూడా ఉంటుందని నిరూపించాడు దర్శకుడు మహేష్ బాబు పి. 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నది హీరో రామ్ నటన గురించి ఎంతలానో, ఆ హీరోను అలా చూపించిన దర్శకుడి ప్రతిభ గురించి కూడా అంతే.
మాస్ సినిమాకు క్లాస్ టచ్ ఇస్తూ, ఒక సున్నితమైన అంశాన్ని ఇంత బలంగా, నిజాయితీగా చెప్పొచ్చని ఆయన రుజువు చేశారు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు అంటే ఎలివేషన్లు, ఫైట్లు, హీరోయిజం కామన్. కానీ ఇందులో హీరోకి, అభిమానికి మధ్య ఉండే ఆ కనిపించని బంధాన్ని వెండితెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతం. పిచ్చి అభిమానం అని కొట్టిపారేయకుండా, ఆ అభిమానమే ఒక సామాన్యుడి జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుందో, కష్టాల్లో ఎలా స్ఫూర్తిని ఇస్తుందో చూపించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది.
దర్శకుడు రాసుకున్న ఆ పాయింటే సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. ముఖ్యంగా ఎమోషన్స్ ను హ్యాండిల్ చేయడంలో మహేష్ బాబు పూర్తి పరిణితి సాధించాడనే చెప్పాలి. రామ్ పోతినేనిలోని మాస్ ఇమేజ్ ను పక్కన పెట్టి, 'సాగర్' అనే ఒక న్యాచురల్ క్యారెక్టర్ ను మనకు పరిచయం చేశాడు. తన హీరో కష్టాల్లో ఉన్నప్పుడు ఒక అభిమాని పడే వేదనను, ఆ తపనను గుండెలకు హత్తుకునేలా చూపించాడు. కొన్ని సన్నివేశాల్లో డైలాగులు లేకపోయినా, కేవలం సందర్భంతోనే కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేయడం దర్శకుడి గొప్పతనం.
ఒక పక్క స్టార్ హీరో ఉపేంద్ర, మరో పక్క వీరాభిమాని రామ్.. ఈ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ చేయడం కత్తి మీద సాము లాంటిది. ఏ మాత్రం తేడా వచ్చినా సినిమా దారి తప్పుతుంది. కానీ మహేష్ బాబు ఆ గీతను చాలా జాగ్రత్తగా దాటాడు. హీరో గొప్పతనాన్ని తగ్గియకుండానే, అభిమాని అస్తిత్వాన్ని నిలబెట్టాడు. "సముద్రం, సూర్యుడు కలవకపోయినా చూడ్డానికి బాగుంటుంది" అనే ఒక్క డైలాగ్ లోనే దర్శకుడి విజన్, ఆ డెప్త్ ఏంటో అర్థమవుతుంది.
ఈ సినిమా కేవలం రామ్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు, ప్రతి ఒక్క సినీ ప్రేమికుడికి నచ్చడానికి కారణం ఆ ఎమోషనే. వేరే హీరోల అభిమానులు కూడా "ఇది మా కథలా ఉంది" అని ఫీల్ అవుతున్నారంటే, దర్శకుడు ఆ పాయింట్ ను ఎంత యూనివర్సల్ గా తీసుకెళ్లాడో అర్థం చేసుకోవచ్చు. వినోదంతో పాటు, జీవితానికి ఉపయోగపడే స్ఫూర్తిని కూడా కథలో ఇమిడిపోయేలా చేయడం మామూలు విషయం కాదు.
ఫైనల్ గా 'ఆంధ్ర కింగ్ తాలూకా' రూపంలో టాలీవుడ్ కు ఒక సెన్సిబుల్ మాస్ డైరెక్టర్ దొరికాడు. కమర్షియల్ హంగుల మధ్య నలిగిపోకుండా, కథలోని సోల్ ని కాపాడుకుంటూ సినిమా తీసిన మహేష్ బాబుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
