Begin typing your search above and press return to search.

క్యాన్స‌ర్ బారిన ప‌డిన బాలీవుడ్ న‌టి

దీపికా కాక‌ర్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం లేక‌పోయినా బాలీవుడ్ లో అమ్మ‌డు బాగా ఫేమ‌స్.

By:  Tupaki Desk   |   29 May 2025 12:00 AM IST
క్యాన్స‌ర్ బారిన ప‌డిన బాలీవుడ్ న‌టి
X

దీపికా కాక‌ర్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం లేక‌పోయినా బాలీవుడ్ లో అమ్మ‌డు బాగా ఫేమ‌స్. టెలివిజ‌న్ ప‌రిశ్ర‌మ‌లో అత్యంత ప్రియ‌మైన న‌టీమ‌ణుల్లో దీపికా కూడా ఒక‌రు. ససురాల్ సిమర్ కా, క‌హాం హమ్ క‌హాం తుమ్ లాంటి షో ల క్యారెక్ట‌ర్ల‌తో దీపికా బాగా పాపుల‌రైంది. అప్ప‌ట్లో ఎక్కువ రెమ్యూన‌రేష‌న్ తీసుకునే బుల్లితెర న‌టిగా నిలిచిన‌ దీపికా బుల్లితెర ద్వారా వ‌చ్చిన క్రేజ్ తోనే 2018లో హిందీ బిగ్ బాస్ కు వెళ్లి విన్న‌ర్ గా గెలిచింది.

2018లో షోయ‌బ్ ఇబ్ర‌హీంను పెళ్లి చేసుకున్న దీపికా, 2023లో రుహాన్ కు జ‌న్మనిచ్చింది. రీసెంట్ గా సెల‌బ్రిటీ మాస్ట‌ర్ చెఫ్ ఇండియా షోలో క‌నిపించిన దీపికా మొన్న ప‌హ‌ల్గాంలో జ‌రిగిన ఉగ్ర‌దాడి నుంచి తృటిలో త‌ప్పించుకుంది. ఫ్యామిలీతో క‌లిసి క‌శ్మీర్ టూర్ కు వెళ్లిన దీపిక త‌మ వెకేష‌న్ ను ముగించుకుని తిరిగి వ‌చ్చిన కొన్ని గంట‌ల్లోనే ఈ ఉగ్ర‌దాడి జ‌రిగింద‌న్న విష‌యాన్ని తెలియ‌చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇక అస‌లు విష‌యానికొస్తే సోష‌ల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటే దీపికా ఇప్పుడు ఓ సంచ‌ల‌న‌ విష‌యాన్ని షేర్ చేసింది. బుల్లితెర న‌టి దీపికా క్యాన్స‌ర్ బారిన ప‌డింద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఇన్‌స్టా ద్వారా దీపికానే తెలిపింది. గ‌త కొన్ని వారాలుగా తాను తీవ్ర‌మైన క‌డుపు నొప్పితో బాధ‌ప‌డుతున్నాన‌ని, హాస్పిట‌ల్ లో టెస్ట్ లు చేయించుకోగా, ఆమె కాలేయంలో టెన్నిస్ బాల్ సైజ్ లో క‌ణితి ఉన్న‌ట్టు డాక్ట‌ర్లు గుర్తించార‌ట‌.

ప‌రీక్ష‌లన్నీ చేశాక త‌న‌కు స్టేజ్2 మాలిగ్నెంట్ క‌ణితిగా డాక్టర్లు నిర్ధారించార‌ని దీపికా త‌న పోస్ట్ లో తెలిపింది. క‌డుపు పై భాగంలో నొప్పి రావ‌డంతో హాస్పిటల్ కు వెళ్ల‌గా వారు కాలేయంలో క‌ణితి ఉన్న‌ట్టు గుర్తించారని, ఈ ప‌రిస్థితిని తాను ధైర్యంగా ఎదుర్కొంటాన‌ని చెప్పింది. దైవానుగ్ర‌హం మ‌రియు అభిమానుల ప్రేమ‌, ఆశీర్వాదాల‌తో ఈ క‌ష్టాన్ని అధిగ‌మిస్తాన‌ని దీపికా త‌న పోస్ట్ లో పేర్కొంది. దీపిక చేసిన ఈ పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతుండ‌గా, ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.