Begin typing your search above and press return to search.

'ఫ్యామిలీ స్టార్' కథేంటో రివీల్ చేసిన దిల్ రాజు!

దీనిపై నిర్మాత దిల్ రాజు తాజాగా స్పందిస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   22 March 2024 4:13 PM GMT
ఫ్యామిలీ స్టార్ కథేంటో రివీల్ చేసిన దిల్ రాజు!
X

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ని పెట్టడంపై అప్పట్లో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపించాయి. దీనిపై నిర్మాత దిల్ రాజు తాజాగా స్పందిస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ హెల్త్ ఇన్సూరెన్స్, ఐడీ కార్డుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి దిల్ రాజుతో పాటు హీరో విజయ్ దేవరకొండ, పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ 'ఫ్యామిలీ స్టార్' గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. విజయ్ దేవరకొండని స్టార్‌గా చూపించడానికి ఈ సినిమా చేయలేదని అన్నారు. కుటుంబం ఎదుగుదల కోసం పాటు పడే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ స్టారే అని చెప్పడానికే ఆ టైటిల్ పెట్టామని తెలిపారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. "ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ పెట్టినప్పుడు విజయ్ దేవరకొండ ను ఏదో స్టార్ గా చూపించడానికి పెట్టారులే అని చాలామంది అనుకున్నారు. సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పటి వరకూ నేను రివీల్ చెయ్యని విషయం చెప్తాను. నాకు తెలిసి మనందరం మన కుటుంబాన్ని ఎక్కడికో పైకి తీసుకురావడానికి కష్టపడుతుంటాం. అలాంటి వాళ్ళందరూ ఫ్యామిలీ స్టార్స్ అనేదే ఈ సినిమా కంటెంట్" అని చెప్పారు. దిల్ రాజు నుంచి ఒక ఫ్యామిలీ మూవీ వస్తే ఎలా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారో, ఈ సినిమా కూడా అలాగే ఉంటుందని ఆయన అన్నారు.

"నేను ఎక్కడి నుంచో వచ్చి నా రంగంలో కష్టపడి ప్రయోజకుడినై, ఇప్పుడు నా కుటుంబాన్ని ఈ సమాజంలో ఒక బాధ్యతాయుతమైన స్థానంలో నిలబెట్టాను. అలా ఫ్యామిలీని పైకి తీసుకొచ్చిన మీరైనా మేమైనా ఫ్యామిలీ స్టార్సే. ఇదే ఫ్యామిలీ స్టార్ కథ. అంతేకానీ విజయ్ దేవరకొండను స్టార్ గా చూపించాలని కాదు. దిల్ రాజు బ్రాండ్ నుంచి ఒక కుటుంబ కథా చిత్రం వస్తే ఎలా ఉంటుందో, ఈ సినిమా కూడా అలానే ఉంటుంది. మీ అందరిలో కూడా ఫ్యామిలీ స్టార్స్ ఉంటారనేది చెప్పడానికే ఈ విషయం చెప్తున్నాను" అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా, ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరుశురామ్ పెట్లా కాంబోలో రాబోతున్న 'ఫ్యామిలీ స్టార్' సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్, టీజర్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్, వాసు వర్మ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చగా.. కేయూ మోహనన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను సమ్మర్ స్పెషల్ గా 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.