Begin typing your search above and press return to search.

వావ్.. దిల్ రాజు చేతిలో అన్ని సినిమాలా?

ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ మూవీ రూపొందించి ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించారు.

By:  Tupaki Desk   |   17 May 2024 9:58 AM GMT
వావ్.. దిల్ రాజు చేతిలో అన్ని సినిమాలా?
X

టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు గురించి అందరికీ తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. 'దిల్' మూవీతో నిర్మాతగా మారారు. ఆ చిత్రంతో సూపర్ హిట్ అందుకుని.. దిల్ టైటిల్ నే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. 21 ఏళ్ల క్రితం నిర్మాతగా మొదలైన దిల్ రాజు కెరీర్.. నేడు ఆయన నిర్మించే సినిమాలు వందల కోట్ల కలెక్షన్స్ అందుకునే వరకు చేరింది. ఆయన బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే చాలు.. మూవీ మినిమమ్ హిట్ గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోతున్నారు సినీ ప్రియులు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు దిల్ రాజు.

ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ మూవీ రూపొందించి ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించారు. ప్రస్తుతం తన సోదరుడి కుమారుడు ఆశిష్ లవ్ మీ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మే 25 వ తేదీన విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2024లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక యంగ్ హీరో నితిన్ తో దిల్ రాజు చేస్తున్న తమ్ముడు మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గా విజయ్ దేవరకొండతో మరో మూవీని అనౌన్స్ చేశారు. రాజావారు రాణిగారు ఫేమ్ రవి కిరణ్ కోలా విజయ్-దిల్ రాజు సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. బలగంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వేణు- నేచురల్ స్టార్ నాని మూవీ కూడా దిల్ రాజు బ్యానర్ పైనే రూపొందనుంది. వీటితోపాటు పాటు సెట్స్ పైకి వెళ్లవలసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అవేంటంటే?

ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం తనతోపాటు వర్క్ చేసిన దర్శకుడు పరశురామ్ కు మరో ఆఫర్ ఇచ్చేందుకు దిల్ రాజు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీని అనౌన్స్ చేయనున్నారట దిల్ రాజు. యంగ్ టాలెంటెడ్ హీరో సుహాస్ తో ఓ సినిమా తీయనున్నారని సమాచారం. సందీప్ బండ్ల ఆ మూవీకి దర్శకత్వం వహించనున్నారని టాక్. బాలయ్యతో కూడా ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను దిల్ అన్న ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక ఆ మధ్య షాహిద్ కపూర్ తో వంశీ పైడిపల్లి హిందీ మూవీ చేస్తారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాను ఓకే చేయించి బాలీవుడ్ లో హిట్ కొట్టాలని దిల్ రాజు అనుకుంటున్నారట. అప్పుడెప్పుడో రవితేజతో ఓ సినిమా అనుకున్నారు దిల్ రాజు. దాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు ఆశిష్, సిద్ధు జొన్నలగడ్డతో చెరో సినిమా రూపొందించాలని అనుకుంటున్నట్లు సమాచారం.

హిట్ సిరీస్ ఫేమ్ శైలేష్ కొలను రాసుకున్న ఓ కథకు హీరో దొరికితే.. ఆ ప్రాజెక్ట్ కూడా దిల్ రాజు నిర్మాణంలో పట్టాలెక్కనుందని వినికిడి. అలా రెండు మూడేళ్ల వరకు సరిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారట దిల్ రాజు. అయితే ఒకప్పుడు వరుస సినిమాలు తీసిన దిల్ రాజు.. ఇప్పుడు స్పీడ్ తగ్గించారని వార్తలు వచ్చాయి. కానీ మిగతా బ్యానర్ల కన్నా ఆయనే ఎక్కువ చిత్రాలను లైన్ లో పెట్టారు. మరి చూడాలి కొత్త చిత్రాలతో దిల్ అన్న ఎలాంటి హిట్లు కొడతారో.