ఫిల్మ్ మేకింగ్ లో దిల్ రాజు కొత్త అడుగు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన లార్వెన్ ఏఐ స్టూడియోను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి డి. శ్రీధర్ బాబు ప్రారంభించారు
By: Tupaki Desk | 4 May 2025 5:26 AMతెలుగు చిత్ర పరిశ్రమ సాంకేతిక వినియోగంలో మరో ముందడుగు వేసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన లార్వెన్ ఏఐ స్టూడియోను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి డి. శ్రీధర్ బాబు ప్రారంభించారు. స్టూడియో లోగోను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆవిష్కరించగా, ఈ కార్యక్రమానికి సుకుమార్, నాగ్ అశ్విన్, రాఘవేంద్ర రావు, వివి వినాయక్, అనిల్ రావిపూడి హాజరయ్యారు.
ఈ ఏఐ.. రచన, స్టోరీ బోర్డింగ్, ప్రీ విజువల్స్, షెడ్యూల్స్ ప్లానింగ్, కాల్షీట్ మేనేజ్‌మెంట్, పిచ్ డెక్‌లను రెడీ చేయడం లాంటి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రాసెస్ లతో పాటూ, ప్రీ పొడక్షన్ నుంచి సినిమా రిలీజ్ ప్లాన్ వరకు అన్ని విధాలా ఇది ఉపయోగపడుతుందని, ఆల్రెడీ ఏఐ వాడకం ఇండస్ట్రీలో బాగా ఎక్కువైందని, ఫ్యూచర్ లో దాని వాడకం మరింత పెరగనుందని దిల్ రాజు పేర్కొన్నారు.
సినీ నిర్మాణంలో దీన్ని ఉపయోగించి ఏమేం చేయొచ్చనే దానిపై తాను పలువురు ఇండస్ట్రీ పెద్దలతో కలిసి వర్క్ చేశానని, ఈ ఏఐ స్టూడియో వల్ల సమయం, ఖర్చు చాలా తగ్గుతుందని ఆయన తెలిపారు. తమ రాబోయే సినిమాలకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉందని వారు భావించారని, ఈ ఏఐ స్టూడియోను తాను అందరికీ రికమండ్ చేస్తానని దిల్ రాజు చెప్పారు.
క్వాంటమ్ ఏఐ గ్లోబల్ సీఓఓ గోపీకా చాగంటి మాట్లాడుతూ, ఏఐ అనేది హ్యూమన్ ఇంటెలిజెన్స్ కు ప్రత్యామ్నాయం కాదని, అది కేవలం వర్క్స్ స్పీడ్ గా జరగడానికి మాత్రమేనని, దీన్ని తయారు చేసేముందు తామెంతో రీసెర్చ్ చేశామని, ఈ ఏఐ ఉత్పత్తులు ఫిల్మ్ మేకింగ్ లో కచ్ఛితంగా గొప్ప మార్పులు తెస్తాయని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ కు ఈ లార్వెన్ ఏఐ స్టూడియోను తీసుకురావాలనే ఆలోచన వచ్చిన దిల్ రాజును అభినందించారు. కొన్ని వీడియోలతోనే ఈ స్టూడియో సామర్థ్యం ఏంటో తనకు అర్థమైందని, టెక్నాలజీ విషయంలో మనం ప్రపంచవ్యాప్తంగా లీడర్స్ గా ప్రూవ్ చేసుకున్నామని, ఈ లార్వెన్ స్టూడియో తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ కు ప్రపంచవ్యాప్తంగా మరిన్ని పేరు ప్రఖ్యాతులు తెస్తుందని, ఫ్యూచర్ ను ఆలోచించి, సినీ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ లో పెట్టుబడి పెట్టినందుకు దిల్ రాజును ఆయన అభినందించారు.