Begin typing your search above and press return to search.

రాజు గారి గ‌ది(కంప‌నీ)లో ఏం జ‌రుగుతోంది?

వ‌రుస హిట్‌ల‌తో హ్యాట్రిక్ కొట్ట‌డ‌మే గ‌గ‌న‌మైన ఈ ఇండ‌స్ట్రీలో నిర్మాత‌గా డ‌బుల్ హ్యాట్రిక్‌ని సొంతం చేసుకున్న ట్రాక్ రికార్డ్ దిల్ రాజు సొంతం.

By:  Tupaki Desk   |   11 July 2025 11:00 PM IST
రాజు గారి గ‌ది(కంప‌నీ)లో ఏం జ‌రుగుతోంది?
X

దిల్ రాజుకు ఏమైంది? ఎందుకీ వ‌రుస డిజాస్ట‌ర్లు. ఆయ‌న కంప‌నీలో ఏం జ‌రుగుతోంది?.. ఆయ‌న జ‌డ్జిమెంట్ ఎందుకు లెక్క త‌ప్పుతోంది?..ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవ‌రిని క‌దిలించినా ఇదే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. దిల్ రాజుకు ఇండ‌స్ట్రీలో స‌క్సెస్‌ఫుల్ నిర్మాత‌గా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 'దిల్' మూవీ నుంచి దిల్ రాజుగా మారిన వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి అదే పేరుని బ్రాండ్‌గా మార్చుకుని స‌క్సెస్‌ఫుల్ నిర్మాత‌గా, డిస్ట్రిబ్యూట‌ర్‌గా, ఎగ్జిబిట‌ర్‌గా కొన‌సాగుతున్నారు. దిల్ రాజు అంటే ఓ బ్రాండ్ అని క్రియేట్ చేసుకున్నారు.

వ‌రుస హిట్‌ల‌తో హ్యాట్రిక్ కొట్ట‌డ‌మే గ‌గ‌న‌మైన ఈ ఇండ‌స్ట్రీలో నిర్మాత‌గా డ‌బుల్ హ్యాట్రిక్‌ని సొంతం చేసుకున్న ట్రాక్ రికార్డ్ దిల్ రాజు సొంతం. దీంతో ఆయ‌న జ‌డ్జిమెంట్ ఉన్న నిర్మాత అని, జ‌నం ప‌ల్స్ తెలిసిన నిర్మాత అని ఇండ‌స్ట్రీ అంతా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది. అందుకు త‌గ్గ‌ట్టే దిల్ రాజు నిర్మాత‌గా, డిస్ట్రిబ్యూట‌ర్‌గా, ఎగ్జిబిట‌ర్‌గా విజ‌యాల్ని సొంతం చేసుకుని ఎంతో మందికి ఆద‌ర్శం అనిపించుకున్నారు. క‌థ‌ల ఎంపిక‌, ఆర్టిస్ట్‌ల కూర్పు నుంచి ప్ర‌తి విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటాడ‌ని ఇండ‌స్ట్రీలో మంచి పేరు ఏర్ప‌డింది.

అదే ఫార్ములాతో సినిమాలు చేశారు. విజ‌యాలు సొంతం చేసుకున్నారు. అయితే ఇది గ‌తం.. ఇప్పుడు ట్రెండ్ మారింది. దిల్ రాజు జ‌డ్జిమెంట్ వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. ఆయ‌న చేసిన సినిమాలు, న‌మ్మ‌కంగా చెప్పిన మూవీస్ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్లు అవుతున్నాయి. దీంతో దిల్ రాజుకు ఏమైంది? ఆయ‌న కంప‌నీలో ఏం జ‌రుగుతోంది? అనే చ‌ర్చ స‌ర్వ‌త్రా మొద‌లైంది. వ‌రుస వివాదాలు, భారీ డిజాస్ట‌ర్లు ఎదుర‌వుతుండ‌టంతో అంతా అవాక్క‌వుతున్నారు. రాజు గారు దారి త‌ప్పార‌ని కామెంట్‌లు చేస్తున్నారు.

రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్‌ల క‌ల‌యిక‌లో చేసిన `గేమ్ ఛేంజ‌ర్` ఊహ‌ల కంద‌ని విధంగా డిజాస్ట‌ర్ కావ‌డం, భారీగా ప్ర‌చారం చేసి ఖ‌చ్చితంగా హిట్ కొడుతున్నాం అని చెప్పిన 'త‌మ్ముడు' సినిమా కూడా ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డం, మితిమీరిన ఆత్మ‌విశ్వాసంతో రూ.75 కోట్లు ఖ‌ర్చు చేసి ఈ సినిమా తీయ‌డం... అందులో స‌గం కూడా తిరిగి రాక‌పోవ‌డంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు రాజు గారికి ఏమైంది అంటూ అవాక్క‌వుతున్నాయి. వ‌రుస విజ‌యాల‌తో ఒక ద‌శ‌లో ఎంతో మంది నిర్మాత‌ల‌కు త‌న‌దైన జ‌డ్జిమెంట్‌తో ఆద‌ర్శంగా నిలిచిన దిల్ రాజు ఇప్పుడు వ‌రుస ఫ్లాపుల‌ని ఎందుకు ఎదుర్కొంటున్నారు? అని అంతా వాపోతున్నారు.

ఆయ‌న ఫ్లాపులు ఎదుర్కోవ‌డానికి కార‌ణం అతి న‌మ్మ‌క‌మ‌ని, ఇంత‌కు ముందులా క‌థ‌పై ప్రాణం పెట్ట‌డం లేద‌ని, దిల్ రాజు సోల్‌ని మిస్ అవుతున్నార‌ని, అదే ఆయ‌న‌కు ఫ్లాపుల్ని, డిజాస్ట‌ర్ల‌ని తెచ్చిపెడుతోంద‌ని ప‌లువురు వాపోతున్నారు. ఇప్ప‌టికైనా తేరుకుని క‌థ‌ని న‌మ్మి సినిమాలు చేస్తే మ‌రో బొమ్మ‌రిల్లు, మ‌రో బ‌ల‌గం వంటి సినిమాలు వ‌స్తాయని అంటున్నారు. మ‌రి ఈ కామెంట్‌ల‌ని దిల్ రాజు ఇక‌నైనా సీరియ‌స్‌గా తీసుకుంటారా? అన్న‌ది వేచి చూడాల్సిందే.