Begin typing your search above and press return to search.

ద‌ళ‌ప‌తి ని ఎర‌గా వేసి స్టార్ సింగ‌ర్ ని దించాల‌న్న‌ది ప్లానా?

బాలీవుడ్ గాయకుడు , నటుడు దిల్జీత్ దోసాంజ్ మేనేజర్ గుర్ ప్రతాప్ సింగ్ కాంగ్ నివాసం వద్ద కర్నాల్‌లో జరిగిన కాల్పుల ఘటన పంజాబ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

By:  Srikanth Kontham   |   14 May 2026 6:00 PM IST
ద‌ళ‌ప‌తి ని ఎర‌గా వేసి స్టార్ సింగ‌ర్ ని దించాల‌న్న‌ది ప్లానా?
X

బాలీవుడ్ గాయకుడు , నటుడు దిల్జీత్ దోసాంజ్ మేనేజర్ గుర్ ప్రతాప్ సింగ్ కాంగ్ నివాసం వద్ద కర్నాల్‌లో జరిగిన కాల్పుల ఘటన పంజాబ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుండగానే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ దాడికి బాధ్యత వహిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. హర్యానా పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నా? మేనేజర్ కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని కర్నాల్ ఎస్పీ నరేంద్ర బిజర్నియా వెల్లడించారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు.

దిల్జీత్ దోసాంజ్‌ను రాజకీయాల్లోకి రావాలని బీజేపీ తీవ్రంగా ఒత్తిడి చేస్తోందని ఆయన ఆ ప్రతిపాదనను తిరస్కరించడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని మాన్ పేర్కొన్నారు. ఒక కళాకారుడిని బలవంతంగా రాజకీయాల్లోకి లాగడం కోసం ఆయన సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవడం అత్యంత దారుణమైన రాజకీయమని మండిపడ్డారు. దిల్జీత్ తన వృత్తిని కళను ప్రేమిస్తాడని ఆయనపై ఇలాంటి ఒత్తిళ్లు తేవడం సరికాదని హితవు పలికారు. ప్రజాదరణ పొందిన సెలబ్రిటీలను రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా ఆయా పార్టీలు తమ బలాన్ని పెంచుకోవాలని చూస్తాయని ముఖ్యమంత్రి వివరించారు.

తమిళ నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం వెనుక ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఉదాహరణగా చూపుతూ దిల్జీత్ విషయంలో కూడా కొన్ని శక్తులు అదే ఆశిస్తున్నాయని విశ్లేషించారు. దిల్జీత్‌కున్న అంతర్జాతీయ స్థాయి గుర్తింపు , ప్రభావం వల్ల ఆయన్ని రాజకీయ ముఖచిత్రంగా మార్చాలనే ప్రయత్నాలు గట్టిగా జరుగుతు న్నాయని అర్థమవుతోంది. అయితే దిల్జీత్ దోసాంజ్ మాత్రం తొలి నుంచీ తనకు రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేదని స్పష్టం చేస్తూనే ఉన్నారు. పంజాబ్ కొత్త రాజకీయ ముఖచిత్రం దిల్జీత్ కాగలరా? అంటూ వెలువడిన కథనాలపై దిల్జీత్ స్పందించారు.

`ఎప్పటికీ లేదు.. నా పని కేవలం ప్రజలను అలరించడం. నేను నా వృత్తిలో చాలా సంతోషంగా ఉన్నాను` అంటూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. రిటైర్డ్ అధికారులు , పౌర సమాజం చేసిన అభ్యర్థనలను కూడా సున్నితంగా తిరస్కరించారు. తాను కేవ‌లం మ్యూజిక్ , సినిమా ప్రపంచానికే పరిమితమని చాటి చెప్పారు. వివాదాలకు దూరంగా ఉండే దిల్జీత్ ఇటీవల తన కన్సర్ట్‌లో ఖలిస్థానీ జెండాలు ప్రదర్శించిన నిరసనకారులకు గట్టి సమాధానమిచ్చారు.

ఎవరైనా బయట నిలబడి నిరసన తెలపడం వారి ఇష్టమని కానీ కన్సర్ట్ లోపలికి వచ్చి తన అభిమానులను వేధిస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. జెండాలు చూపించడం కంటే ఆ జెండా వెనుక ఉన్న ఉద్దేశం , ప్రవర్తన ముఖ్యమని కుండబద్దలు కొట్టారు. తనను వ్యతిరేకించే వారు ఎన్ని జెండాలైనా ఊపుకోవచ్చని? అది తనను ప్రభావితం చేయదని దిల్జీత్ స్పష్టం చేశారు.