'గేమ్ ఛేంజర్' డ్యామేజ్ కంట్రోల్ కోసం..!
రామ్ చరణ్, శంకర్ కాంబోలో దిల్ రాజు నిర్మించిన 'గేమ్ ఛేంజర్' ఈ ఏడాదిలోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 1 July 2025 11:27 AM ISTరామ్ చరణ్, శంకర్ కాంబోలో దిల్ రాజు నిర్మించిన 'గేమ్ ఛేంజర్' ఈ ఏడాదిలోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెల్సిందే. 2025 సంక్రాంతికి వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఆ సినిమా భారీ నష్టాలను మిగల్చబోతుందని తనకు అర్థం అయిందని నిర్మాత దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. గేమ్ ఛేంజర్ సినిమా కమర్షియల్‌గా తీవ్రంగా నిరుత్సాహ పరిచిందని అన్నాడు. అయితే రామ్ చరణ్ అంటే తనకు చాలా గౌరవం, ఇష్టం అని దిల్ రాజు అన్నాడు. మెగాస్టార్ చిరంజీవి కొడుకు అయినా కూడా చరణ్‌లో కొంత గర్వం అనేది ఉండదని దిల్ రాజు ఇటీవల చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
దిల్ రాజు బ్యానర్‌లో రూపొందిన 'తమ్ముడు' సినిమా ఈ వారంలో విడుదల కాబోతుంది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. పలు ఇంటర్వ్యూల్లో, పలు సందర్భాల్లో రామ్ చరణ్ గురించి దిల్ రాజు చాలా పాజిటివ్‌గా స్పందించాడు. గేమ్ ఛేంజర్ సినిమా ఆర్థికంగా నిరాశను మిగిల్చినా కూడా రామ్ చరణ్‌తో సినిమా చేసిన సంతృప్తి ఉందని దిల్ రాజు అన్నాడు. రామ్ చరణ్ పై అభిమానంతో గేమ్ ఛేంజర్ సినిమాకు హద్దులు దాటి మరీ బడ్జెట్ పెట్టామని, రిజల్ట్ మాత్రం పాజిటివ్‌గా రాలేదని అన్నాడు. అయితే రామ్ చరణ్‌తో మరో సినిమాను చేసేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దిల్ రాజు గేమ్ ఛేంజర్ డ్యామేజ్‌ను కంట్రోల్ చేసుకునేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారని, రామ్ చరణ్ తో ఒక సినిమాకు ఒప్పించడం ద్వారా కచ్చితంగా ఆ డ్యామేజ్‌ను కంట్రోల్ చేసుకోవచ్చని దిల్ రాజు భావిస్తున్నాడట. గేమ్ ఛేంజర్ ఫలితం కారణంగా రామ్ చరణ్ కచ్చితంగా పారితోషికం విషయంలో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తాడు. అంతే కాకుండా చరణ్ ఇమేజ్‌కి తగ్గట్లుగా కాకుండా ఒక మోస్తరు బడ్జెట్‌తో సినిమాను దిల్ రాజు నిర్మిస్తే కచ్చితంగా మంచి బిజినెస్ చేయడం ఖాయం, తద్వారా గేమ్ ఛేంజర్ సినిమాతో వచ్చిన నష్టాలను దిల్ రాజు పూడ్చుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
రామ్ చరణ్ వరుసగా సినిమాలకు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు. ఆ రెండు సినిమాల తర్వాత స్నేహితుడి బ్యానర్‌లో ఒక సినిమాను రామ్ చరణ్ చేసేందుకు హామీ ఇచ్చాడట. ఆ బ్యానర్ ఏంటి? ఆ స్నేహితుడు ఎవరు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇంత బిజీగా ఉన్న రామ్ చరణ్ డేట్ల కోసం దిల్ రాజు ప్రయత్నించడం విడ్డూరంగా ఉందని కొందరు అంటున్నారు. అయితే చరణ్ కోసం ఒక మంచి కథను రెడీ చేయించి తీసుకు వెళ్తే ఇతర ప్రాజెక్ట్‌లను సైతం పక్కన పెట్టి దిల్ రాజుకు డేట్లు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. అందుకే దిల్ రాజు తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
