ఓటీటీ లీకులతో థియేటర్ కు ముప్పే.. దిల్ రాజు మరో క్లారిటీ!
తాజాగా ‘తమ్ముడు’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ....
By: Tupaki Desk | 2 July 2025 10:00 PM ISTఇటీవల కాలంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సినిమా ఇండస్ట్రీపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్న విషయం తెలిసిందే. థియేటర్స్‌కి ప్రేక్షకుల రాక తగ్గడంలో ఓటీటీలు ముఖ్య కారణంగా మారాయి. సినిమా విడుదలైన నెల రోజులోనే ఓటీటీలోకి రావడం, మరోవైపు ఓటీటీ సంస్థలు ముందుగానే తమ లోగోతో ప్రచారం చేయడం వలన ప్రేక్షకులు “ఒక్క నెల లోపే ఓటీటీలో వస్తుంది కదా” అనే అభిప్రాయంతో థియేటర్‌కి వెళ్లడం తగ్గిస్తున్నారు. దీంతో థియేటర్ కలెక్షన్లు తగ్గిపోతున్నాయి.
తాజాగా ‘తమ్ముడు’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, థియేటర్ బిజినెస్‌కి ఓటీటీలు ఎలా సమస్యగా మారుతున్నాయో వివరించారు. ముఖ్యంగా సినిమా రిలీజ్ రోజే ఓటీటీ లాగోలు పెట్టడం వల్ల సినిమాకు థియేటర్ రిలీజ్ టైంలో నెగెటివ్‌గా ఫీల్ వస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు “త్వరలోనే ఓటీటీలో వచ్చేస్తుంది కదా” అనే ఆలోచనతో థియేటర్‌కి రావడం తగ్గిస్తున్నారని చెప్పారు.
ఇక్కడే దిల్ రాజు కీలక వ్యాఖ్య చేశారు. "ఈ విషయం గురించి మేము ముందుగానే అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి పెద్ద ఓటీటీ సంస్థలతో చర్చించాం. వాళ్లు కూడా సినిమాకే డామేజ్ అవుతుందంటే తమ లోగోను పెట్టకుండా ప్రచారం చేయడానికే సిద్ధంగా ఉన్నారు" అన్నారు. ఇది పరిశ్రమకు ఓ హితబోధనే. కానీ ఇక్కడ అసలు సమస్య నిర్మాతలవైపు ఉంది అని దిల్ రాజు చెప్పడం ఆసక్తికరం.
ఎందుకంటే.. ఓటీటీలు తప్పని చెప్పినా, ఇప్పటికీ కొన్ని నిర్మాణ సంస్థలు తమ సినిమాల పోస్టర్లపై ఓటీటీ వివరాలు ముందుగానే పెడుతున్నారు. ఇది తమ సినిమాకు ప్రీ రిలీజ్ బజ్ కోసం చేయొచ్చేమో కానీ, థియేటర్ బిజినెస్‌ను దెబ్బతీయడమేనని పరిశ్రమలోని పెద్దలు భావిస్తున్నారు. ఈ విషయాన్ని మరోసారి నిర్మాతలతో మాట్లాడి, ఓటీటీ లాగోలను సినిమాల ప్రమోషన్‌లో తొలగించాలని చూస్తామని దిల్ రాజు చెప్పడం మరింత చర్చనీయాంశంగా మారింది.
ఈ విధంగా చూస్తే, ఓటీటీ డామినేషన్‌ను తగ్గించాలంటే, ముందుగా సినిమాకు సంబంధించి ఓటీటీ వివరాలు బయటపడకుండా ఉండాలి. సినిమాకు ప్రీమియర్ డ్యామేజ్ కాకుండా, థియేటర్ కలెక్షన్లు మెరుగవ్వాలని పరిశ్రమ మొత్తం ఆశిస్తోంది. ఇకపోతే, దిల్ రాజు ముందుచూపుతో నిర్మాతల మధ్య ఈ సమస్యపై మరోసారి చర్చించి ఒక మార్గం చూపిస్తే, థియేటర్స్‌కి మంచి రోజులు రావచ్చు.
