అదే జరిగితే భవిష్యత్తులో ప్రొడ్యూసర్స్ బ్రోకర్స్ అవుతారు:దిల్ రాజు
ఓటీటీల కారణంగా ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోందని, దాన్ని నమ్మి ప్రేక్షకుల్ని థియేటర్లకు రాకుండా చేశామని దిల్ రాజు వాపోయారు.
By: Tupaki Desk | 27 Jun 2025 8:00 PM ISTఓటీటీల కారణంగా ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోందని, దాన్ని నమ్మి ప్రేక్షకుల్ని థియేటర్లకు రాకుండా చేశామని దిల్ రాజు వాపోయారు. నితిన్‌తో ఆయన నిర్మించిన భారీ బడ్జెట్ మూవీ `తమ్ముడు`. సప్తమిగౌడ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ద్వారా లయ మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా జూలై 4న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ని టీమ్ ప్రారంభించింది. ఇదే సమయంలో నిర్మాత దిల్ రాజు పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ దిల్ రాజు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. కోవిడ్ వల్ల అందరికి ఏడాదిన్నర గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌లో అందరు కొత్త కథలు రాసుకున్నారు. అదే సమయంలో ఓటీటీ అనే కొత్త దారి ఏర్పడింది. దీంతో ఓటీటీల్లో ఒరిజినల్స్ తీద్దామా? వెబ్ సిరీస్‌లు తీద్దామా. అనే ఆలోచన మొదలైంది. థియేటర్ సినిమాలే కాకుండా కొత్తగా ఏదైనా చేయాలనే మార్కెట్ పరిధి పెరిగింది.
దీంతో మొత్తం మార్కెట్ స్వరూపమే సమూలంగా మారిపోయింది. దాని ఎఫెక్ట్ ఇప్పుడు ఇండస్ట్రీపై పడింది. అప్పుడు ఇండస్ట్రీకి ఓటీటీల వల్ల జరిగే నష్టం తెలియక వావ్! ఓటీటీల వల్ల సినిమాలకు కొత్త బిజినెస్ ఓపెన్ అయిందని సంకలు గుద్దుకున్నాం. పది కోట్లు ఉన్న రెమ్యునరేషన్‌లు కాస్తా దీని కారణంగా రూ.50 కోట్లకు మారిపోయాయి. అదే క్రమంలో రూ.50 కోట్లు కాస్తా రూ.60కి ఆ తరువాత రూ.100 కోట్లకు పెరిగింది. కానీ రెవెన్యూ మాత్రం రావడం లేదు. దీని వల్ల థియేట్రికల్ రెవెన్యూ దారుణంగా పడిపోయింది.
ఓటీటీల్లో ఆడి థియేటర్లలో ఆడకపోతే ఆ సినిమా ఆడినట్టు కాదు. ఈ విషయం అందరికి తెలుసు. ప్రేక్షకులు ఎక్కడ ఎంజాయ్ చేస్తారు? థియేటర్. థియేటర్లలో సినిమాలు ఆడకపోతే నిర్మాతలకు ఇక ఓటీటీలే దిక్కు. అక్కడ నిర్మాతలు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌లుగా చెలామణి అవ్వరు.. బ్రోకర్స్ అవుతారు. ప్రస్తుత పరిస్థితిపై తొందరపడకపోతే భవిష్యత్తులో ప్రొడ్యూసర్స్ ఓటీటీలకు బ్రోకర్స్‌గా వర్క్ చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి` అని దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓటీటీలు సినిమా థియేట్రికల్ వాతావరణాన్ని కిల్ చేస్తాయని 2020లోనే అనుమానించాను. `వి` సినిమాని డైరెక్ట్‌గా ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలా అని సురేష్‌బాబు, అల్లు అరవింద్‌లతో చర్చించాను. ఓటీటీ వాళ్లు `వి` మూవీని ఓరిజినల్స్ పేరుతో రిలీజ్ చేస్తామని అడుగుతున్నారని వారికి చెప్పాను. నేను తీసుకోబోయే స్టెప్ వల్ల ఏం జరుగొచ్చు అని వారిని అడగడం జరిగింది. అప్పుడు సురేష్‌బాబు, అరవింద్‌గారు ఏం చెప్పారంటే నీ దగ్గర కాంటెంట్ రెడీగా ఉంది. నువ్వు కాకపోతే వాళ్లకు మరొకడు ఇస్తాడు.. ఎన్ని రోజులని ఇంట్రెస్ట్‌లు భరిస్తూ నీ దగ్గర పెట్టుకుంటావు. నిర్ణయం తీసుకునే టైమ్ వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవడమే` అన్నారు.
ఆ విషయం నానితో చర్చించి ఓటీటీ వారి దగ్గరికి వెళ్లాం. వెళ్లిన దగ్గరి నుంచే నాకు అనుమానం మొదలైంది. ఒక సినిమాని ఇంట్లో కూర్చుని చూడండి అని ప్రేక్షకులకు అలవాటు చేస్తున్నామే అని భయపడ్డాను. అప్పుడే ఇండస్ట్రీకి డ్యామేజ్ మొదలైందని భావించాను. `వకీల్‌సాబ్` రిలీజ్ తరువాత కోవిడ్ సెకండ్ లాక్‌డౌన్ మొదలు కాగానే వెళ్లి అమెజాన్ వాళ్లతో మాట్లాడి అమౌంట్ తగ్గించి మీరు ఏం ఇస్తారో ఇవ్వండి అని వారికి సినిమా ఇవ్వడం జరిగింది. ఇలాంటి తప్పులు మేం చేయడం వల్లే ఈ రోజు ఇండస్ట్రీ దారుణమైన స్థితిలోకి వెళ్లింది. థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు పెద్ద సినిమాలు ఓటీటీల్లో వస్తాయని చెప్పి వారిని థియేటర్లకు మేమే దూరం చేస్తూ వచ్చాం. వాళ్లు ఇప్పుడు థియేటర్లకు రావడం లేదంటే ఆ తప్పు ప్రేక్షకులది కాదు మాది. మేం చేసిన తొందర పాటు నిర్ణయాల వల్లే ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు` అని చెప్పుకొచ్చారు.
