Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్: శిరీష్ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

'గేమ్ ఛేంజర్' సినిమా ఫలితం తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలైన దిల్ రాజు, శిరీష్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.

By:  Tupaki Desk   |   1 July 2025 2:51 PM
గేమ్ ఛేంజర్: శిరీష్ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు
X

'గేమ్ ఛేంజర్' సినిమా ఫలితం తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలైన దిల్ రాజు, శిరీష్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ముఖ్యంగా శిరీష్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు, హీరో రామ్ చరణ్‌ నుంచి ఫోన్ కూడా రాలేదని అన్నట్లు వార్తల్లో రావడంతో వివాదం పెరిగింది. దీనిపై ఇప్పుడు దిల్ రాజు స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చారు. రామ్ చరణ్, శంకర్‌లతో తన ప్రయాణం, గేమ్ ఛేంజర్ వాయిదాల కారణాలు, శిరీష్ వ్యాఖ్యల వెనకున్న అసలు ఉద్దేశాన్ని వివరిస్తూ స్పష్టత ఇచ్చారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. 'తమ్ముడు' సినిమా ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి కూడా గేమ్ ఛేంజర్ ప్రస్తావన లేకుండా ఏ ఇంటర్వ్యూతో జరగడం లేదు. ఏదో ఒక విషయంపై స్పందించాల్సి వస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమా ద్వారా నేను ఆ చిత్ర యూనిట్ సభ్యులతో చాలా క్లోజ్‌గా ట్రావెల్ అయ్యాను. అటు రామ్ చరణ్, ఇటు శంకర్ గారితో కలిసి పని చేశాను. కానీ శిరీష్ గారు ఆ సినిమాలో పెద్దగా ఇన్‌వాల్వ్ కాలేదు. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో మాత్రం ఆయన పూర్తిగా ట్రావెల్ అయ్యారు.

గేమ్ ఛేంజర్ విషయంలో నేను ఇప్పటికే అన్నీ వివరాలు చెప్పాను. డైరెక్టర్‌తో డైరెక్ట్‌గా వేవ్‌లెంగ్త్ కుదరకపోవడం వల్ల, మాట్లాడి పని చేయించుకోవడంలో కొంత గ్యాప్ ఏర్పడింది. అక్కడ నేను రామ్ చరణ్ గారి గురించి ఏ విధంగా మాట్లాడలేదు. RRR తర్వాత శంకర్ గారితో కాంబినేషన్‌లో రామ్ చరణ్ మాకు డేట్స్ ఇచ్చారు. ఆ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఇండియన్ 2 కూడా రీస్టార్ట్ కావడంతో గేమ్ ఛేంజర్ బ్రేక్‌కి గురైంది.

ఆ సమయంలో రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో ఖాళీగా కూర్చోవడం నన్ను కలచివేసింది. నేనే చెప్పాను వేరే సినిమా చేస్తే మంచిదని. అయినా కూడా రామ్ చరణ్ గారు గేమ్ ఛేంజర్ కోసం పూర్తిగా టైం కేటాయించారు. ఏ ఇతర సినిమా చేయకుండా ఈ సినిమా కోసమే డెడికేట్ అయ్యారు. ఓపికగా సినిమా పూర్తి చేశారు. రిలీజ్ సమయంలో కూడా చరణ్ గారు, చిరంజీవి గారితో కలిసి మాట్లాడం. బాగా సపోర్ట్ చేశారు.

గేమ్ ఛేంజర్ ప్లాప్ అయినా నేను మరో సినిమాతో సేఫ్ అయ్యాను. కానీ రామ్ చరణ్ మాత్రం తన తదుపరి పెద్ద సినిమా కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. నిన్న కూడా ఒకే మాట అన్నాను.. రామ్ చరణ్ గారితో మరో మంచి సక్సెస్‌ఫుల్ సినిమా చేయాలని మేము భావిస్తున్నాము. మంచి కథ సిద్ధం చేసి పెద్ద బడ్జెట్‌లో చేయాలనే ప్లాన్‌ చేస్తున్నాం.

శిరీష్ గారి వ్యాఖ్యల విషయానికి వస్తే.. ఆయన మీడియా ముందు మాట్లాడటం చాలా అరుదు. ఇప్పటి వరకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఈసారి మాత్రం తమ్ముడు సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ టైంలో ఆయన ఎమోషనల్ అయ్యారు. గేమ్ ఛేంజర్ ఫెయిలయితే మాకు డ్యామేజ్ ఎక్కువే. ఆయన డిస్ట్రిబ్యూటర్ కోణంలో మాట్లాడినప్పటికీ, ఎవరినీ నెగిటివ్ చేయాలనే ఉద్దేశం లేదు. చరణ్ గారితో ఆయనకూ, మాకూ మంచి సంబంధాలే ఉన్నాయి. సోషల్ మీడియాలో కేవలం కొన్ని మాటలను మాత్రమే హైలైట్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ మొత్తాన్ని చూసిన వారికే ఆయన ఉద్దేశం అర్థమవుతుంది.' అని దిల్ రాజు స్పష్టం చేశారు.