బన్నీతో మూవీ.. దిల్ రాజు ప్లాన్ ఏంటి?
టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ పై ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిసి మళ్లీ సినిమా చేయనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
By: M Prashanth | 16 April 2026 9:00 PM ISTటాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ పై ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిసి మళ్లీ సినిమా చేయనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో.. ఆ కొత్త ప్రాజెక్ట్ పై అప్పుడే భారీ అంచనాలు నెలకొంటున్నాయి.
దిల్ రాజు– అల్లు అర్జున్ రిలేషన్ చాలా కాలంగా కొనసాగుతోంది. బన్నీ కెరీర్ ప్రారంభ దశలోనే దిల్ రాజు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆర్య సినిమా అల్లు అర్జున్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన టర్నింగ్ పాయింట్ మూవీగా నిలిచింది. ఆ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించగా, దిల్ రాజు నిర్మాణంలో భారీ విజయం సాధించింది. ఆ తరువాత వచ్చిన పరుగు కూడా మంచి సక్సెస్ అందుకుంది. భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం ఫ్యామిలీ ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అలాగే దువ్వాడ జగన్నాథమ్ (DJ) కమర్షియల్ గా మంచి వసూళ్లు సాధించి ఆ కాంబినేషన్ కు మరో హిట్ ను జోడించింది. ఇప్పటికే ఆ సక్సెస్ ట్రాక్ రికార్డ్ కారణంగా, వీరిద్దరి కాంబోలో మరో సినిమా రావాలనే ఆశ అభిమానుల్లో చాలా కాలంగా ఉంది. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం వరుసగా పలు భారీ ప్రాజెక్ట్‌లకు కమిట్ కావడంతో, దిల్ రాజుతో సినిమా కొంతకాలం వాయిదా పడింది. తన ప్రస్తుత సినిమాలన్నీ పూర్తి చేసిన తర్వాత తప్పకుండా దిల్ రాజుతో పని చేస్తానని అల్లు అర్జున్ మాట ఇచ్చినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో దిల్ రాజు కూడా ఆ ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇమేజ్ కు తగ్గట్టుగా.. పాన్ ఇండియా స్థాయిలో మెప్పించే కథ కోసం ప్రత్యేకంగా వెతుకుతున్నారు. ముఖ్యంగా సరైన దర్శకుడి ఎంపికపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరోకు సరిపోయే కథతో పాటు, మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, ఈ ఏడాది చివరికల్లా లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో కథ, దర్శకుడు ఖరారు అయ్యే అవకాశముంది. అధికారిక ప్రకటన మాత్రం 2027లో వచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. చిత్రీకరణ 2028లో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.
మొత్తానికి, ఇప్పటికే హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు.. అల్లు అర్జున్ జోడీ మళ్లీ కలిసి వర్క్ వస్తే, అది కచ్చితంగా బిగ్గెస్ట్ మూవీగా మారే అవకాశం ఉంది. సరైన కథ, క్రేజీ డైరెక్టర్ కలిస్తే ఈలా ప్రాజెక్ట్ టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు అభిమానులు ఆ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
