Begin typing your search above and press return to search.

మార్వెల్, డీసీలను దాటే సత్తా భారతీయ పురాణాలకే సాధ్యం!

తాజాగా హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన ఫిల్మ్ మేక‌ర్స్, నిర్మాతలు, యానిమేటర్లు, టెక్నాలజీ నిపుణుల సమావేశంలో ఈ అంశంపై పలు ఆసక్తికర విషయాలు ప్రస్తావనకు వచ్చాయి.

By:  Srikanth Kontham   |   24 Oct 2026 8:00 PM IST
మార్వెల్, డీసీలను దాటే సత్తా భారతీయ పురాణాలకే సాధ్యం!
X

హాలీవుడ్‌లో మార్వెల్- డీసీ క్యారెక్టర్లు ఎలా ప్రపంచవ్యాప్తంగా భారీ సినిమాటిక్ యూనివర్స్‌ను సృష్టించి బాక్సాఫీస్‌ను శాసిస్తున్నాయో? అదే రీతిలో భార‌త్ పురాణాలు, ఇతిహాసాలు, జానపదాలు కూడా అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులను ఆకట్టుకునే గ్లోబల్ స్టోరీటెల్లింగ్ యూనివర్స్‌గా అవ‌త‌రిస్తాయి అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. డీసీ-మార్వెల్ క్యారెక్ట‌ర్లే ఊహాజ‌నిత‌మైతే? మ‌న ఇతిహాసాలు నిజ‌మైన‌వి. తాజాగా హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన ఫిల్మ్ మేక‌ర్స్, నిర్మాతలు, యానిమేటర్లు, టెక్నాలజీ నిపుణుల సమావేశంలో ఈ అంశంపై పలు ఆసక్తికర విషయాలు ప్రస్తావనకు వచ్చాయి.

అత్యాధునిక సాంకేతికత, ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్ వాడకమే కాకుండా మన సంస్కృతిలోని అపారమైన కథా సంపదను ప్రపంచానికి ఎలా పరిచయం చేయాలనే దానిపై సవివరమైన చర్చ జరిగింది. టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులు సినిమా నిర్మాణాన్ని మరింత సులభతరం చేస్తున్నాయని ప్రొడ్యూసర్, తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అభిప్రాయపడ్డారు.

దాదాపు రెండు దశాబ్దాల క్రితం `అరుంధతి`, `మగధీర`, `కొచ్చాడయాన్` వంటి చిత్రాలతో టాలీవుడ్‌లోకి వీఎఫ్ఎక్స్ ప్రవేశించిందని కానీ నేడు ఏఐ వేగంగా మారుతున్న తీరు పూర్తిగా భిన్నంగా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మొబైల్ ఫోన్ల సాయంతోనే అత్యు త్తమ దృశ్యాలు సృష్టించే స్థాయికి టెక్నాలజీ చేరుకుంటుందని.. పెద్ద స్టూడియోల అవసరం లేకుండానే యువ సృష్టికర్తలు స్వతంత్రంగా సినిమాలు తీయోచ్చ‌ని అంచనా వేశారు.

`హనుమాన్` వంటి చిత్రాలు కొత్త టెక్నాలజీ సాయంతో ప్రేక్షకులకు అందించిన సరికొత్త అనుభూతినే ఇందుకు నిదర్శనంగా అభివర్ణించారు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత అభివృద్ధి చెందినా? అది కేవలం ఒక శక్తివంతమైన సాధనంగా మాత్రమే ఉపయోగపడుతుంది. అంతేకాని మనుషుల సహజమైన భావోద్వేగాలను, అనుభవాలను ఏఐ ఎప్పటికీ భర్తీ చేయలేదని దర్శకుడు రాజేష్ మాపుస్కార్ స్పష్టం చేశారు.

తన నుంచి రాబో తున్న‌ గ్లోబల్ ఏఐ చిత్రం `చిరంజీవి హనుమాన్` అనుభవాలను పంచుకుంటూ దర్శకుడి ఊహాశక్తి, నిజ జీవిత జ్ఞాపకాల నుంచి వచ్చే ప్రామాణికత కథకు ప్రాణం పోస్తాయని అభిప్రాయపడ్డారు. రాజమౌళి వంటి దర్శకులు దేశీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన‌ స్పూర్తితో టెక్నాలజీ పరిధులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.

దేశంలో ఉన్న పురాణాలు, సంస్కృతి, జానపద కథలను ఇప్పటి వరకు ఎవ‌రూ సరిగ్గా అన్వేషించలేదని గ్యాలరీ 5 సీఈఓ విజయ్ సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. ప్రపంచాన్ని హాలీవుడ్ సినిమాలు ఏ విధంగా శాసిస్తున్నాయో ప్రస్తావిస్తూ మనకు కూడా మార్వెల్- డీసీ లాంటి అపారమైన ఇతిహాసాల నిధి ఉందని అయితే వాటిని ప్రపంచ స్థాయి ఫ్రాంచైజీలుగా మలచడంలో మనం ఇంకా వెనుకబడి ఉన్నామని విశ్లేషించారు. మన పురాణ కథలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం కేవలం వ్యాపారం మాత్రమే కాదని.. అది మన దేశం పట్ల ఉన్న బాధ్యత అని పేర్కొన్నారు.

భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఇప్పటికే పాన్-ఇండియా దశను దాటి గ్లోబల్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో మన పౌరాణిక నేపథ్యాలు సరికొత్త అవకాశాలను తెచ్చిపెడుతున్నాయి. టెక్నాలజీ ..ఏఐ టూల్స్ అందుబాటులోకి వస్తున్న ఆధునిక యుగంలో భారీ బడ్జెట్‌లతో సంబంధం లేకుండా అద్భుతమైన విజువల్స్ సృష్టించడం సులభతరమైంది. దీంతో సాంకేతిక లోపాలు అనే అడ్డంకులు తొలగిపోయి బలమైన కథాంశాలపై దృష్టి పెట్టడానికి సృష్టికర్తలకు పూర్తి అవకాశం లభిస్తోంది.

భారతీయ పురాణేతిహాసాలు మన దేశానికే పరిమితం కాకుండా ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే సత్తా కలిగి ఉన్నాయి. సరైన వ్యూహం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్క్రీన్‌ప్లే, సరికొత్త టెక్నాలజీని జోడించి తెరకెక్కిస్తే మన ఇతిహాసాలు మార్వెల్, డీసీ స్థాయికి మించి గ్లోబల్ బాక్సాఫీస్‌ను ఏలే రోజులు త్వరలోనే వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.