ప్రభుత్వ అవార్డులను సీరియస్‌గా తీస్కోండయా: దిల్ రాజు
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో పరిశ్రమ 24 శాఖల ప్రముఖులు కనిపించారు.
By: Tupaki Desk | 16 Jun 2025 5:03 AMఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డుల వేడుకలు ఎప్పుడు? ఈ ప్రశ్నకు ఇంకా సమాధానం లేదు కానీ, తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంతో టాలీవుడ్ లో కొత్త ఉత్సాహం నింపింది. చాలా గ్యాప్ తర్వాత అవార్డుల కార్యక్రమం జరగడం ఉత్సాహపరిచింది. సీఎం రేవంత్ రెడ్డి చొరవకు పరిశ్రమ ధన్యవాదాలు తెలిపింది. ఇక చిత్రసీమకు తెలంగాణ ప్రభుత్వానికి వారధిగా పని చేస్తున్న దిల్ రాజు చొరవకు అందరూ ధన్యవాదాలు చెబుతున్నారు.
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో పరిశ్రమ 24 శాఖల ప్రముఖులు కనిపించారు. పలువురు అగ్ర తారలు, దర్శకులు, నిర్మాతలు ఇతర రంగాల ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేదికపై టాలీవుడ్ కి చెందిన కొందరు పెద్ద స్టార్లు, ద్వితీయ శ్రేణి హీరోలు కూడా లేకపోవడం నిరాశపరిచింది. దీనిని గమనించిన తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ (టిఎఫ్‌డిసి) చైర్మన్ దిల్ రాజు ఈ విషయాన్ని నేరుగా ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అవార్డుల కార్యక్రమాలకు తగిన ప్రాధాన్యతనివ్వాలని.. అవార్డు వేడుకలకు తారలు తప్పనిసరిగా హాజరవ్వాలని ఆకాంక్షించారు.
ఎవరైనా స్టార్లు ఔట్ డోర్ షూటింగుల్లో ఉన్నా కానీ, తేదీని డైరీలో రాసుకుని మరీ మర్చిపోకుండా అవార్డుల కోసం హాజరవ్వాలని దిల్ రాజు కోరారు. అయితే ఆయన ఇలా వ్యాఖ్యానించడం సబబైనదే. ఎందుకంటే ఫలానా సంవత్సరం అవార్డు వేడుకల్లో పాల్గొన్న తారలు అనే రికార్డ్ యూట్యూబ్ లో నిక్షిప్తమై ఉంటుంది. ఒకవేళ మిస్సయితే ఆ వీడియో నిర్జీవంగా కనిపిస్తుంది. తరతరాల వారసత్వానికి చిహ్నంగా, ఈ వీడియోలే మన టాలీవుడ్ ఘనతను భావి తరాలకు ప్రచారం చేసేది. అందువల్ల కనీసం ప్రభుత్వ అవార్డుల కోసమైనా తారలు విధిగా తరలి రావాల్సి ఉంది.
ఏపీలో నంది అవార్డులు ఎప్పుడు?
ఆంధ్రప్రదేశ్ లో నంది అవార్డుల కార్యక్రమం ఎప్పుడు? అనేది ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. బహుశా దీని గురించి ఆలోచించేందుకు త్వరలో జరగనున్న సీఎంతో పరిశ్రమ ప్రముఖుల భేటీ సహకరిస్తుందని భావిస్తున్నారు. ఇక గద్దర్ అవార్డుల వేడుకలో నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి ప్రారంభించనుందని దిల్ రాజు హింట్ ఇచ్చారు. నంది అవార్డులకు కూడా పరిశ్రమ నుంచి అందరూ హాజరవ్వాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ తరపున ప్రభుత్వంతో పరిశ్రమకు వారధిగా దిల్ రాజు పని చేస్తుండగా, ఆంద్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా పరిశ్రమకు వారధిగా కొనసాగుతుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఏపీలో సినీపరిశ్రమ ఏర్పాటు గురించి పవన్ కల్యాణ్ ఇటీవల చంద్రబాబుతో మంతనాలు సాగించారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.