బాలీవుడ్ పెళ్లికూతుళ్లకు భిన్నంగా దియా మీర్జా! తన పెళ్లిళ్ల వెనుక ఇంత కథ ఉందా!
హైదరాబాద్‌లో జన్మించిన అందాల తార దియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 7 April 2025 1:00 AM ISTహైదరాబాద్‌లో జన్మించిన అందాల తార దియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిస్ ఏసియా పసిఫిక్ ఇంటర్నేషనల్‌గా కిరీటం గెలుచుకున్న ఈ అందాల భామ, ఆ తర్వాత వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగులోనూ నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' చిత్రంలో ఆమె చివరిగా కనిపించింది. కేవలం సినిమాలే కాకుండా పలు వ్యాపారాల్లోనూ రాణిస్తున్న దియా మీర్జా వ్యక్తిగత జీవితంలో మాత్రం ప్రేమ పెళ్లి కలిసి రాలేదు. 2014లో తన వ్యాపార భాగస్వామి సాహిల్ సంఘానిని వివాహం చేసుకున్న దియా, ఐదేళ్లలోనే ఆ బంధానికి స్వస్తి చెప్పింది. ఆ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని, అప్పటికే వివాహితుడు, ఒక బిడ్డకు తండ్రి అయిన వైభవ్ రేఖిని రెండో వివాహం చేసుకుంది. అయితే, తన మొదటి పెళ్లి గురించి దియా మీర్జా ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో దియా మీర్జా తన పర్యావరణ అనుకూల కార్యక్రమాలు, ఆలోచనల గురించి మాట్లాడుతూ తన రెండో పెళ్లిని పూర్తిగా ప్రకృతికి అనుగుణంగా చేసుకున్నట్లు వెల్లడించింది. వారి ఇంటి తోటలోనే అత్యంత నిరాడంబరంగా, సహజమైన పద్ధతుల్లో ఈ వివాహం జరిగింది. చేతితో తయారు చేసిన ప్రత్యేకమైన బహుమతులు, స్థానికంగా లభించే సహజమైన అలంకరణ వస్తువులనే వివాహం కోసం ఉపయోగించారట. ఆహార వ్యర్థాలను తగ్గించడానికి అతిథులకు శాకాహార, మాంసాహార వంటకాల సంఖ్యను ముందుగానే నిర్ధారించుకుని భోజనాలను కూడా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. అంతేకాదు, ఒక మహిళా పూజారితో దియా, వైభవ్ తమ వివాహ వేడుకను చాలా సాదాసీదాగా పూర్తి చేసుకున్నారు.
ముఖ్యంగా, పెళ్లి కూతురుగా బాలీవుడ్ వధువులకు సాధారణమైన లెహంగాకు బదులుగా దియా ఎరుపు రంగు బనారసీ చీరను ఎంచుకోవడం విశేషం. ఇదే సందర్భంలో ఆమె తన మొదటి పెళ్లి గురించి కూడా గుర్తు చేసుకుంది. అది ఒక ఫార్మ్ హౌజ్‌లో చాలా ఆడంబరంగా జరిగిందని, ఆ పెళ్లిలో తాను ఖరీదైన దుస్తులను ధరించానని తెలిపింది. బాలీవుడ్ వధువుల తరహాలోనే లెహంగా వేసుకున్నానని చెప్పింది. అయితే, వివాహాల తర్వాత బ్రైడల్ లెహంగాలు చాలావరకు నిరుపయోగంగా ఉండిపోతాయని ఆమె అభిప్రాయపడింది. వాటిని పారవేయలేక, మళ్లీ ధరించలేక చాలామంది వాటిని వార్డ్‌రోబ్‌లలో ఉంచుతారని తెలిపింది. పర్యావరణ అనుకూల దృక్పథం కలిగిన తాను ఆ పరిస్థితిని ఇష్టపడలేదని దియా చెప్పింది.
అందుకే తన మొదటి పెళ్లిలో తాను ధరించిన వివాహ లెహంగాను వేలం వేయాలని నిర్ణయించుకున్నానని, అనుకున్నట్లుగానే దానిని మంచి ధరకు వేలం వేసినట్లు ఆమె వెల్లడించింది. నిరుపయోగంగా పడి ఉండకూడదనే ఉద్దేశంతోనే తాను తన రెండో పెళ్లికి సాధారణ చీరను ఎంచుకున్నానని, తన భర్త వైభవ్ రేఖీ కూడా అదే పని చేశారని తెలిపింది. పెళ్లి తర్వాత ఉపయోగించకుండా అలానే ఉండిపోయే దుస్తులకు బదులు జీవితాంతం ధరించగలిగే దుస్తులను ఆయన కూడా ఎంచుకున్నట్లు దియా పేర్కొంది. తన పెళ్లి రోజున దియా మీర్జా సాంప్రదాయ ఎరుపు రంగుకు దూరంగా డిజైనర్ రీతూ కుమార్ తయారు చేసిన ఆకుపచ్చ జర్దోసీ ఘరారాను ఎంచుకోవడం మరో విశేషం.
