Begin typing your search above and press return to search.

అంతర్గత ప్రశాంతతకై అగ్రస్థానానికి దూరంగా దియా మీర్జా!

చిత్ర పరిశ్రమలో అపారమైన కీర్తి.. డబ్బు .. విజయాన్ని అందుకోవడం ప్రతి ఒక్కరి కల. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలోనే ఇవన్నీ లభిస్తే ఆ స్టార్‌డమ్‌ను వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు.

By:  Srikanth Kontham   |   6 Jun 2026 8:00 PM IST
అంతర్గత ప్రశాంతతకై అగ్రస్థానానికి దూరంగా దియా మీర్జా!
X

చిత్ర పరిశ్రమలో అపారమైన కీర్తి.. డబ్బు .. విజయాన్ని అందుకోవడం ప్రతి ఒక్కరి కల. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలోనే ఇవన్నీ లభిస్తే ఆ స్టార్‌డమ్‌ను వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఆసియా పసిఫిక్ దియా మీర్జా ప్రయాణం ఇందుకు పూర్తిగా భిన్నం. కేవలం 24 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన దియా ఒకానొక దశలో ఆ గ్లామర్ ప్రపంచం తనకు నిజమైన సంతోషాన్ని ఇవ్వడం లేదని గ్రహించి ధైర్యంగా దానికి దూరంగా నడవాలని నిర్ణయించుకున్నారు. మిస్ ఆసియా పసిఫిక్ కిరీటాన్ని గెలుచుకున్న తర్వాత దియా మీర్జాకు బాలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చాయి. ఆమె నటించిన చిత్రాలు మంచి విజ‌యాలు సాధించ‌డంతో పాటు పరిశ్రమలో లగ్జరీ జీవితం, భారీ పాపులారిటీ లభించాయి.

అయితే బాహ్య ప్రపంచానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపించే లైమ్‌లైట్ ఆమె అంతరాత్మను మాత్రం సంతృప్తి పరచలేకపోయింది. సినిమా విజయాలు, అవార్డుల కంటే కూడా జీవితంలో మరింత అర్థవంతమైన ప్రయాణం ఏదో ఉందనే భావన దియాలో బలంగా నాటుకుంది. 20 ఏళ్ల వ‌య‌సులో ఉన్నప్పుడే ఈ విధమైన ఆత్మపరిశీలన చేసుకోవడం సాధారణ విషయం కాదు. డబ్బు ..కీర్తి ఒక స్థాయి వరకు మాత్రమే ఆనందాన్ని ఇస్తాయి. కానీ అవి మన మనసుకు ప్రశాంతతను చేకూర్చలేవు. `ఈ జీవితం నాకు నిజమైన సంతోషాన్ని ఇవ్వడం లేదు` అని తనకు తానుగా స్పష్టతకు వచ్చిన తర్వాత దియా మీర్జా సినిమా అవకాశాల వెంట పరుగులు తీయడం మానేసారు.

కేవలం కమర్షియల్ విలువల కోసం కాకుండా.. సమాజానికి ఉపయోగపడే పనుల వైపు అడుగులు వేశారు.

గ్లామర్ పరిశ్రమ నుండి విరామం తీసుకున్న తర్వాత దియా మీర్జా పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల రక్షణ , సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ గుడ్‌విల్ అంబాసిడర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రకృతి సమతుల్యతపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. గ్లామర్ ప్రపంచాన్ని వదిలి ప్రకృతి ఒడిలో ఆమె కనుగొన్న కొత్త పాత్ర ఆమెకు సినిమాల కంటే ఎక్కువ ఆత్మసంతృప్తిని గుర్తింపును తెచ్చిపెట్టింది. ఒక నటిగా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల చిత్ర పరిశ్రమలో అవకాశాలు తగ్గుతాయనే భయం ఉన్నా? దియా మీర్జా మాత్రం అంతర్గత ప్రయాణానికే ప్రాధాన్యత ఇచ్చారు.

ఈ మార్పు ఆమెను కేవలం ఒక నటిగానే కాకుండా బాధ్యతాయుతమైన గ్లోబల్ సిటిజన్‌గా తీర్చిదిద్దింది. ప్రస్తుత కాలంలో కథా బలం ఉన్న, సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే పరిమిత చిత్రాలలో మాత్రమే న‌టిస్తున్నారు. చివ‌రిగాదియా మీర్జా జీవిత ప్రయాణం నేటి తరానికి గొప్ప పాఠం. విజయం .. సంతోషం అనేవి బ్యాంక్ బ్యాలెన్స్ లేదా సెలబ్రిటీ హోదాపై ఆధారపడి ఉండవని అవి మనసుకు నచ్చిన పనిని చేయడంలోనే లభిస్తాయని నిరూపించారు. బాహ్య విజయాల కంటే అంతర్గత ప్రశాంతతే మిన్న అని చాటి చెప్పిన దియా మీర్జా నిర్ణయం నిజంగా అభినందనీయం.