ఆ స్క్రిప్ట్ పీఎంవో నుండి వచ్చిందా?
బాలీవుడ్ చిత్రం `దురంధర్` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. రెండు భాగాలు 3000 కోట్ల వసూళ్లను సాధించి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది.
By: Srikanth Kontham | 18 Jun 2026 11:42 AM ISTబాలీవుడ్ చిత్రం `దురంధర్` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. రెండు భాగాలు 3000 కోట్ల వసూళ్లను సాధించి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇండియన్ స్పై సినిమాలకే `ధురంధర్` తలమానికంగా నిలిచింది. ఇప్పట్లో స్పై జోనర్లో ధురంధర్ రికార్డను బీట్ చేయడం సాధ్యం కానిది. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతుంది. చిత్ర స్క్రిప్ట్ నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం (PMO) నుండి వచ్చిందనే ప్రచారం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజాగా ఈ ప్రచారంపై కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు రాకేష్ బేడీ స్పందించారు. ఒక సినిమా స్క్రిప్ట్ పీఎంవో లాంటి అత్యున్నత ప్రభుత్వ కార్యాలయం నుండి రావడం అనేది కేవలం ఊహాజనితమైన విషయమని కొట్టిపారేశారు. ఇండస్ట్రీలో దేశభక్తి.. నిఘా వర్గాల నేపథ్యంలో సినిమా వస్తున్నప్పుడు ఇలాంటి వింత కథనాలు ప్రచారంలోకి రావడం సహజమేనని అభిప్రాయపడ్డారు. ` ఆదిత్య ధర్ గతంలో `ఉరి` లాంటి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన దేశభక్తి చిత్రాన్ని అందించారు. ఆ సినిమా సాధించడమే కాకుండా ప్రభుత్వ వర్గాల నుండి కూడా ప్రశంసలు అందుకుంది.
బహుశా ఆ కారణం చేతనే జియో-పొలిటికల్ థ్రిల్లర్ కథ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే భావన నెటిజన్లలో కలిగి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. కానీ సినిమా అనేది పూర్తిగా దర్శకుడి సృజనాత్మకతకు సంబంధించినదని రాకేష్ బేడీ స్పష్టం చేశారు. భారతీయ నిఘా సంస్థల నేపథ్యంతో కూడిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో ప్లాన్ చేసారు. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన భారీ తారాగణం ఉన్న సినిమా కావడం వల్లే స్క్రిప్ట్ అత్యంత రహస్యంగా ఉంచారని.. ఆ రహస్యమే ఈ రకమైన పుకార్లకు కారణమైందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి ముడిపెట్టడం అనేది చిత్ర యూనిట్‌కు కూడా ఆశ్చర్యాన్ని కలిగించిం దన్నారు. ఇదే ప్రచారం సినిమా రిలీజ్ కు ముందు జరిగి ఉంటే బోలెడంత ఉచిత పబ్లిసిటీ వచ్చేదన్నారు. అలా జరిగినా? అదీ కొంత సమస్యగా కూడా మారేదన్నారు. ఎందుకంటే పీఎంఓ కార్యాలయం అంటే? వాళ్ల నుంచి కూడా క్లారిటీ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడేది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ రకమైన ప్రచారం రావడంతో దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. రాకేష్ బేడీ ఇచ్చిన వివరణతో స్క్రిప్ట్ వివాదానికి తెరపడింది. ప్రస్తుతం `ధురంధర్` టీమ్ ఆ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తోంది.
