ధురంధర్ కు మనోళ్లు డబుల్ ఖర్చు పెడతారా? రైటర్ అలా అనేశారేంటి?
స్పై యాక్షన్ జోనర్ లో రూపొందిన ధురంధర్ సినిమా గత ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 7 April 2026 8:39 AM ISTస్పై యాక్షన్ జోనర్ లో రూపొందిన ధురంధర్ సినిమా గత ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ధురంధర్: ది రివెంజ్ కూడా సూపర్ హిట్ గా నిలవడంతో ఆ ఫ్రాంచైజీకి మంచి క్రేజ్ ఏర్పడింది. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో నటించగా, ఆదిత్య ధర్ ఆ రెండు చిత్రాలు తెరకెక్కించారు.
భారీ యాక్షన్ సీన్స్, ఇంటర్నేషనల్ లెవెల్ ప్రొడక్షన్ వాల్యూస్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే ఆ రెండు భాగాల నిర్మాణానికి సుమారు రూ.260 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసినట్లు ఇప్పటికే నిర్మాతలు వెల్లడించారు. భారీ పెట్టుబడికి తగ్గట్టుగానే.. కాదు కాదు.. బడ్జెట్ కు మించి పెద్ద ఎత్తున వసూళ్లు సాధించాయి. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్, విదేశీ లొకేషన్స్, స్టార్ క్యాస్టింగ్.. అన్నీ కలిపి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
అయితే, ఇదే సినిమాను తెలుగులో తీస్తే ఖర్చు ఎంత అవుతుందనే విషయంపై తాజాగా టాలీవుడ్ స్టార్ రైటర్ బీవీఎస్ రవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ధురంధర్ వంటి సినిమాను నిర్మించడానికి ఎంత కష్టం పడాల్సి ఉంటుందో వివరించారు. ఆ సినిమా మొత్తం చూస్తే దాదాపు ఎనిమిది గంటల కంటెంట్ ఉంటుందని తెలిపారు.
"ఎంత కష్టపడి ఉంటారు.. ఎంత రీసెర్చ్ చేసి ఉంటారు.. లాజిక్ కోసం ట్రై ఉంటారు.. ప్రజలు పెట్టుకున్న నమ్మకం కోసం ఆలోచించి ఉంటారు.. నిర్మాతను ఎలా కన్విన్స్ చేసి ఉంటారు.. ధురంధర్ క్రియేటివ్ విషయంలో పక్కన పెడితే.. అది రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ కు ఎండింగ్.. రెండు పార్టులు చూస్తే.. ఆ సినిమా రెండు పార్టులు రూ.260 కోట్ల బడ్జెట్ అయిందని అనౌన్స్ చేశారు" అని తెలిపారు.
"సినిమాలో రణవీర్ సింగ్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా వంటి పలువురు ప్రముఖ నటులు యాక్ట్ చేశారు. భారీ సెట్స్, విదేశీ లొకేషన్స్, ఫైట్ సీన్స్.. అన్నీ కలిపి ఆ బడ్జెట్ వచ్చింది. రణవీర్ సింగ్ ఎలా ఉంటుంది.. బ్యాంకాక్ లో అదిరిపోయే సెట్ వేశారు. ఇవన్నీ కలిపి రూ.260 కోట్లు అయింది. మన దగ్గర అయితే" అంటూ మాట్లాడారు బీవీఎస్ రవి.
అప్పుడు హోస్ట్ మన దగ్గర ఇదే సినిమా తీస్తే రూ.500 కోట్లు అవుతుందా? అని ప్రశ్నించగా, బీవీఎస్ రవి అంగీకరించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది నెటిజన్లు ఆయన అభిప్రాయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు మన దర్శకులు కూడా తక్కువేమీ కాదు, సరైన ప్లానింగ్ ఉంటే ఇలాంటి సినిమాలు తీయొచ్చంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ధురంధర్ బడ్జెట్ పై ఓపెన్ గా రైటర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
