దురంధర్ స్క్రిప్టు కాపీనా? కోర్టు లో జడ్జి ఏం తేల్చారంటే?
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన భారీ యాక్షన్ సీక్వెల్ `దురంధర్: ది రివెంజ్` (దురంధర్ 2).
By: Sivaji Kontham | 5 Jun 2026 9:58 AM ISTరణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన భారీ యాక్షన్ సీక్వెల్ `దురంధర్: ది రివెంజ్` (దురంధర్ 2). థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా... డిజిటల్ రిలీజ్ సమయంలో ఊహించని విధంగా న్యాయపరమైన చిక్కుల్లో పడింది. ఈ సినిమా కథ తన స్క్రిప్టు నుంచి కాపీ కొట్టారంటూ ఫిలింమేకర్ సంతోష్ కుమార్ ముంబై సివిల్ కోర్టును ఆశ్రయించారు. సినిమా ఓటీటీ విడుదలను అడ్డుకోవాలని... స్టే ఇవ్వాలని ఆయన కోరడంతో ఈ వివాదం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
అయితే ఈ స్క్రిప్ట్ వివాదంపై విచారణ జరిపిన ముంబై సివిల్ కోర్టు సంతోష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. ఆదిత్య ధర్ స్క్రిప్ట్ కాపీనా కాదా? అనే కోణంలో కోర్టు కీలక పరిశీలనలు చేసింది. సినిమా డిజిటల్ విడుదలకు ఎలాంటి స్టే ఇవ్వలేమని స్పష్టం చేస్తూ... ఓటీటీ ప్రీమియర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎటువంటి ఆటంకాలు లేకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి రావడానికి మార్గం సుగమమైంది.
కోర్టు తన తీర్పులో పిటిషనర్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది. సంతోష్ కుమార్ గతంలో ఇదే అంశంపై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా... అక్కడ పిటిషన్ కొట్టివేస్తూ సరైన కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను ఇచ్చారు. అయితే ఈ విషయాన్ని సంతోష్ కుమార్ ముంబై కోర్టు ముందు దాచిపెట్టారు. ఈ దాగుడుమూతలపై కోర్టు స్పందిస్తూ.. ``ఫిర్యాదుదారుడు కోర్టుకు నిజాయితీతో రాలేదని ఈ విషయం స్పష్టం చేస్తోంది`` అని వ్యాఖ్యానించింది. నిజాలను దాచడం పిటిషనర్‌కు ప్రతికూలంగా మారింది.
మరోవైపు కథ దొంగిలించారు అనడానికి ఎలాంటి పక్కా ఆధారాలను కోర్టు ముందు ఉంచలేదు. ఫిర్యాదుదారుడి స్క్రిప్ట్‌కు `దురంధర్ 2` సినిమాకు మధ్య ఉన్న పోలికలను నిరూపించే ఎలాంటి కంపేరేటివ్ మెటీరియల్ ను సమర్పించడంలో పిటిషనర్ విఫలమయ్యారు. డైలాగులు లేదా స్క్రిప్ట్ ఏ విధంగా ఒకేలా ఉన్నాయో పరిశీలించకుండా... కేవలం ఆరోపణల ఆధారంగా స్టే ఇవ్వడం లేదా కోర్టు కమిషనర్‌ను నియమించడం సాధ్యం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ హక్కులు మూడో పక్షానికి (థర్డ్ పార్టీ) బదిలీ అయ్యాయని..ఈ తరుణంలో స్టే ఇస్తే డిఫెండెంట్లకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని కోర్టు పేర్కొంది. ఒకవేళ భవిష్యత్తులో సంతోష్ కుమార్ కోర్టులో గెలిస్తే నష్టపరిహారం క్లెయిమ్ చేసుకోవచ్చని... కాబట్టి ప్రస్తుతం స్టే అవసరం లేదని పిటిషన్‌ను కొట్టేసింది. ఈ తీర్పుతో జూన్ 4 నుండి `దురంధర్ 2` పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ `జియోహాట్‌స్టార్`లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.
