Begin typing your search above and press return to search.

ధురంధర్ వసూళ్లు: ఏంటి రూ.500 కోట్ల వాళ్లకు ఇవ్వాలా?

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్‌ సిరీస్‌ చిత్రాలు వరల్డ్ వైడ్ గా చర్చనీయాంశంగా మారాయి.

By:  M Prashanth   |   29 March 2026 5:12 PM IST
ధురంధర్ వసూళ్లు: ఏంటి రూ.500 కోట్ల వాళ్లకు ఇవ్వాలా?
X

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్‌ సిరీస్‌ చిత్రాలు వరల్డ్ వైడ్ గా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా పాకిస్థాన్‌ లోని కరాచీ నగరంలోని లియారీ ప్రాంతం నేపథ్యంలో రూపొందిన ఆ సినిమాలు అక్కడి ప్రజల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించాయని చెప్పాలి. అయితే అక్కడ రెండు మూవీలు కూడా రిలీజ్ అవ్వలేదన్న సంగతి తెలిసిందే.

2025 డిసెంబర్‌ లో విడుదలైన ధురంధర్‌ మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించగా, దాని సీక్వెల్ ధురంధర్‌ 2 రీసెంట్ గా విడుదలై భారీ వసూళ్లతో ప్రస్తుతం అదరగొడుతోంది. ఇప్పటికే ఆ సినిమా రూ. 1000 కోట్ల మార్క్‌ దాటి దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో లియారీ ప్రాంత ప్రజల రెస్పాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

సినిమాలో తమ ప్రాంత జీవన విధానాన్ని చూపించిన తీరు పట్ల లియారీ ప్రజలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా లాభాల్లో తమకు షేర్ ఇవ్వాలని డిమాండ్ చేయడం నవ్వులు పూయిస్తోంది. కొన్ని వైరల్ వీడియోల ప్రకారం, సినిమా కలెక్షన్స్‌ లో 80 శాతం తమకే ఇవ్వాలని వారు పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఇంకా కొందరు స్థానికులు మరింత సెటైరికల్ గా స్పందిస్తూ, ధురంధర్‌ 2 రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసిన నేపథ్యంలో, అందులో కనీసం రూ. 500 కోట్లు తమ ప్రాంత అభివృద్ధికి ఇవ్వాలని కోరుతున్నారు. ఆ డబ్బుతో లియారీ ప్రాంతంలో రోడ్లు, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసుకుంటామని వారు చెబుతున్నారు. అయితే, ఈ వ్యాఖ్యలు పూర్తిగా ఫన్నీగా చేసినవేనని వీడియో చూస్తే అర్థమవుతోంది.

అయినప్పటికీ ఆ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ గా షేర్ అవుతూ ట్రెండింగ్‌లో నిలిచింది. లియారీ ప్రజల రెస్పాన్స్ కు నెటిజన్లు నవ్వుకుంటున్నారు. అదే సమయంలో, సినిమాలో తమ ప్రాంతాన్ని గ్యాంగ్ వార్లు, డ్రగ్స్, హింసకు కేంద్రంగా చూపించడంపై కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లియారీకి మంచి యాంగిల్ కూడా ఉందని, భవిష్యత్తులో తమ ప్రాంతాన్ని పాజిటివ్ గా చూపించాలని కోరుతున్నారు.

అయినా కూడా.. ధురంధర్‌ సినిమాతో తమ ప్రాంతం ఇంటర్నేషనల్ రేంజ్ లో గుర్తింపు పొందిందని వారు అభిప్రాయపడుతున్నారు. తమ లైఫ్ స్టైల్ ను ప్రపంచానికి చూపించినందుకు దర్శకుడు ఆదిత్య ధర్‌ ను ప్రశంసించడం కూడా వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. మొత్తానికి ఒక సినిమా విజయంతో దాని కథా నేపథ్యం ఉన్న ప్రాంతం ఇలా చర్చకు రావడం ఆసక్తికరంగా మారింది. లియారీ ప్రజల వినూత్న డిమాండ్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హాట్ టాపిక్ గా మారాయి.