Begin typing your search above and press return to search.

‘ధురంధర్-2’ కంటెంట్‌పై అనుమానాలు… కేంద్రాన్ని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు!

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన బాలీవుడ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్‌ 2’ చుట్టూ ఇప్పుడు అనూహ్యంగా ఒక చట్టపరమైన వివాదం ముసురుకుంది.

By:  Madhu Reddy   |   21 May 2026 9:00 AM IST
‘ధురంధర్-2’ కంటెంట్‌పై అనుమానాలు… కేంద్రాన్ని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు!
X

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన బాలీవుడ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్‌ 2’ చుట్టూ ఇప్పుడు అనూహ్యంగా ఒక చట్టపరమైన వివాదం ముసురుకుంది. థియేటర్లలో ఏకంగా 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో దేశ రక్షణకు సంబంధించిన అత్యంత సున్నితమైన విషయాలను బహిర్గతం చేశారనే ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు స్పందిస్తూ.. దీనిపై తక్షణమే విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి, సెన్సార్ బోర్డుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు చూద్దాం..

కోర్టును ఆశ్రయించిన హెడ్ కానిస్టేబుల్:

సశస్త్ర సీమా బల్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న దీపక్ కుమార్ అనే అధికారి ఈ సినిమా కంటెంట్‌పై ఢిల్లీ హైకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. సినిమాలో చూపించిన కొన్ని ఆర్మీ ఆపరేషన్ల వివరాలు, సాయుధ దళాల అంతర్గత రహస్యాలు దేశ భద్రతకు ముప్పు తెచ్చేలా ఉన్నాయని ఆయన తన పిటిషన్‌లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు:

బుధవారం ఈ కేసుపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమా అనేది కేవలం కల్పిత కథ ఆధారంగానే తెరకెక్కినప్పటికీ.. దేశ భద్రతా దళాల్లో రాత్రింబగళ్లు పనిచేస్తున్న సిబ్బంది వ్యక్తం చేసిన ఆందోళనలను, అభ్యంతరాలను అంత తేలికగా తీసిపారేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక అందుకే ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిశీలించాలని కేంద్రానికి, సీబీఎఫ్‌సీకి సూచించింది.

రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్:

రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ ఆదిత్యధర్‌ కాంబినేషన్‌లో ఒక పవర్‌ఫుల్ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ‘ధురంధర్‌ 2’ గత మార్చి నెలలో విడుదలై సంచలన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 1800 కోట్ల వసూల్ తో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇక రణ్‌వీర్ కెరీర్‌లోనే ఇది మైల్‌స్టోన్ మూవీగా నిలిచింది.

ఓటీటీ రిలీజ్ టైమ్‌లో కొత్త టెన్షన్:

ప్రస్తుతం విదేశాల్లో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఇక భారతీయ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కూడా డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇక ఇండియాలో ఈ సినిమా జూన్ 4 నుంచి ‘జియో హాట్‌స్టార్‌’ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అయితే సరిగ్గా ఓటీటీ రిలీజ్‌కు కొన్ని రోజుల ముందే ఇలా కోర్టు నోటీసులు రావడం ఇప్పుడు మూవీ టీమ్‌లో కొత్త టెన్షన్ పుట్టిస్తోంది.

కమర్షియల్ సినిమాల్లో వినోదం ఎంత ముఖ్యమో.. దేశ భద్రతను కాపాడటం కూడా అంతే ముఖ్యం. మరి ఈ ‘ధురంధర్-2’ కంటెంట్‌పై కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయి? జూన్ 4న జరగాల్సిన ఇండియా ఓటీటీ స్ట్రీమింగ్‌పై దీని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా?అనేది తేలాలంటే వేటింగ్ తప్పదు మరి