Begin typing your search above and press return to search.

రామ్ గోపాల్ వర్మ ఫైర్.. బాలీవుడ్ మౌనంపై ఘాటు విమర్శలు

కేవలం 10 రోజుల్లోనే రూ. 1200 కోట్లు వసూలు చేసి, రూ. 2000 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తున్న ఈ సినిమాపై బాలీవుడ్ ప్రముఖులు మౌనంగా ఉండటం చర్చనీయాంశమైంది.

By:  Madhu Reddy   |   30 March 2026 3:27 PM IST
రామ్ గోపాల్ వర్మ ఫైర్.. బాలీవుడ్ మౌనంపై ఘాటు విమర్శలు
X

రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. కేవలం 10 రోజుల్లోనే రూ. 1200 కోట్లు వసూలు చేసి, రూ. 2000 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తున్న ఈ సినిమాపై బాలీవుడ్ ప్రముఖులు మౌనంగా ఉండటం చర్చనీయాంశమైంది. ఈ నిశ్శబ్దాన్ని జీర్ణించుకోలేని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇండస్ట్రీ పునాదులు కదులుతున్నా స్పందించకపోవడంపై ఆయన సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. ఆ వివరాలు చూద్దాం..

ఇండస్ట్రీ కింద అణుబాంబు పేలింది:

ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్ 2' కేవలం సినిమా మాత్రమే కాదని, అది భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక 'సినిమాటిక్ రీసెట్ బటన్' అని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న ప్రభంజనం చూస్తుంటే ఆదిత్య ధర్ పరిశ్రమ పునాదుల కింద అణుబాంబు పేల్చినట్లు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఇంత పెద్ద విజయం కళ్లముందే కనిపిస్తున్నా, పరిశ్రమలో కనిపిస్తున్న ఈ నిశ్శబ్దం తనను దిగ్భ్రాంతికి గురిచేస్తోందని వర్మ ఘాటుగా విమర్శించారు.

బాలీవుడ్ మందంతా అంతరిక్షంలోకి పోయారా?:

బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ సినిమా విజయాన్ని పట్టించుకోకపోవడంపై ఆర్జీవీ తన మార్కు సెటైర్లు వేశారు. "ఈ భారీ పేలుడు ధాటికి బాలీవుడ్ మందంతా అంతరిక్షంలోకి విసిరివేయబడ్డారా? అందుకే వారి చప్పట్లు మనకు వినపడటం లేదా?" అంటూ ఎద్దేవా చేశారు. ఒక గొప్ప సినిమా వచ్చినప్పుడు దాన్ని అభినందించే సంస్కారం ఉండాలని, కానీ ఇక్కడ అసూయ లేదా భయం వల్ల చాలామంది నోరు మెదపడం లేదని ఆయన పరోక్షంగా చురకలు అంటించారు.

డైనోసార్ లాంటి సినిమా:

'ధురంధర్ 2'ను ఒక 'డైనోసార్'తో పోల్చిన వర్మ, ఇతర దర్శకులు, నిర్మాతలు ఈ సినిమా నుంచి మేకింగ్ పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ఆదిత్య ధర్ విజన్, రణవీర్ సింగ్ విశ్వరూపం కలిసి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించాయని, ఇక ఇప్పటికైనా మారకపోతే పాతకాలపు సినిమాల సమాధిలోనే మిగిలిపోతారని హెచ్చరించారు. ఈ సినిమా సృష్టించిన కొత్త ఒరవడిని అర్థం చేసుకోకపోవడం మూర్ఖత్వమే అవుతుందని ఆయన స్పష్టం చేశారు.

మొత్తానికి 'ధురంధర్ 2' విజయంపై ఆర్జీవీ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ వర్గాలు ఇప్పటికైనా మౌనం వీడి ఈ ఘనవిజయంపై స్పందిస్తాయో లేదో చూడాలి. ఏదేమైనా, రికార్డుల వేటలో ఈ సినిమా సామాన్య ప్రేక్షకుడికి మాత్రం కావాల్సిన వినోదాన్ని పంచుతూ, రూ. 2000 కోట్ల భారీ లక్ష్యం వైపు అడుగులు వేస్తోంది. కథలో దమ్ముంటే భాషతో సంబంధం లేకుండా జనం బ్రహ్మరథం పడతారని ఈ సినిమా మరోసారి నిరూపించింది.