Begin typing your search above and press return to search.

టాలీవుడ్ పై స్టార్ వార‌సుల ఫోక‌స్

తమిళ స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ తనదైన నటనతో దక్షిణాది చిత్రసీమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

By:  Sravani Lakshmi Srungarapu   |   16 Feb 2026 1:06 PM IST
టాలీవుడ్ పై స్టార్ వార‌సుల ఫోక‌స్
X

తమిళ స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ తనదైన నటనతో దక్షిణాది చిత్రసీమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన వారసుడు ధృవ్ విక్ర‌మ్ కూడా తండ్రి లాగానే కెరీర్ స‌క్సెస్ అవాల‌ని చూస్తున్నాడు. ఇప్ప‌టికే ధృవ్ హీరోగా ప‌లు సినిమాల్లో న‌టించ‌గా, ఇప్పుడు ధృవ్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

త‌మిళంలో స‌త్తా చాటిన ధృవ్

ధృవ్ త్వ‌ర‌లో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయ‌బోతున్నాడ‌నే వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే తమిళంలో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న ధృవ్, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను టార్గెట్ చేయడం విశేషంగా మారింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించనుంద‌ని తెలుస్తోంది. భారీ ప్రాజెక్టులను తెరకెక్కించడంలో ముందుండే ఈ బ్యానర్, కొత్త తరం హీరోతో రొమాంటిక్ కామెడీని ప్లాన్ చేసింద‌ని స‌మాచారం. కథ పరంగా యూత్‌ఫుల్ టోన్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునేలా స్క్రిప్ట్ రెడీ అవుతోంద‌ని టాక్ వినిపిస్తోంది.

మ‌న‌సాన‌మఃకు నేష‌న‌ల్ లెవెల్ గుర్తింపు

ఈ మూవీకి మనసానమః షార్ట్ ఫిల్మ్‌తో నేష‌న‌ల్ స్థాయిలో గుర్తింపు పొందిన దీప‌క్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని సమాచారం. ఆయన తెరకెక్కించిన మ‌న‌సాన‌మః సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు అనేక అవార్డులు అందుకుంది. ఎమోష‌న్స్ ను సహజంగా పట్టుకునే శైలి ఉన్న డైరెక్ట‌ర్ గా గుర్తింపు పొందిన దీపక్ రెడ్డి, ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్ రూపంలో ధృవ్‌ను కొత్త కోణంలో చూపించనున్నార‌ని అంటున్నారు.

రీసెంట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఐశ్వ‌ర్యా అర్జున్

రీసెంట్ గా తమిళ హీరో అర్జున్ కూతురు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌గా, స్టార్ వారసుల దృష్టి ఇప్పుడు తెలుగు మార్కెట్‌పై పడటం గ‌మ‌నార్హం. గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆదరణ పొందుతున్న నేపథ్యంలో, ఇతర భాషల నటులు తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపడం సహజమే. ఆల్రెడీ శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, ప్ర‌స్తుతం పెద్ది సినిమా చేస్తున్నారు.

ధృవ్ విక్ర‌మ్ విషయంలో కూడా ఇదే వ్యూహం కనిపిస్తోంది. కేవలం డబ్బింగ్ సినిమాలతో కాకుండా, నేటివిటీకి దగ్గరగా ఉండే కథతో నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలనే ప్రయత్నం చేస్తున్నారని, రొమాంటిక్ కామెడీ జానర్ యూత్ ఆడియన్స్‌ను త్వరగా కనెక్ట్ చేసుకునే అవకాశముంటుంద‌ని ధృవ్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పటికైతే ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ టాలీవుడ్‌లో మరో స్టార్ వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధమవుతోందనే వార్త మాత్రం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌స్తే, కాస్టింగ్ మరియు షూటింగ్ వివరాలపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.