ధృవ్ ఇన్నాళ్లూ వెయిట్ చేసింది అందుకేనా?
చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ టాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
By: Sravani Lakshmi Srungarapu | 6 April 2026 7:00 PM ISTచియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ టాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. తమిళంలో ఇప్పటికే తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్న ధృవ్, ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను చేతిలోకి తీసుకోవడం దీనికి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా ద్వారా ధృవ్ విక్రమ్ టాలీవుడ్‌లో అడుగుపెట్టడం ఒక కీలక పరిణామంగా భావిస్తున్నారు.
డెబ్యూ మాత్రమే కాదు, లెగసీ కొనసాగింపు కూడా!
టాలీవుడ్ లో ధృవ్ డెబ్యూ కేవలం మరో హీరో పరిచయం మాత్రమే కాదు, ఒక లెగసీ కొనసాగింపుగా కూడా చూడొచ్చు. విభిన్న పాత్రలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన విక్రమ్ కొడుకుగా ధృవ్ పై మామూలుగానే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. విక్రమ్ వారసుడిగా ధృవ్ ఎలా నిలబడతాడో చూడాలని అతని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ గతంలో కొత్త కాన్సెప్ట్స్, పాన్-ఇండియా ప్రాజెక్ట్స్‌తో మంచి ట్రాక్ రికార్డ్‌ను సంపాదించింది. ఇప్పుడు ధృవ్‌ను తెలుగు మార్కెట్‌లో లాంచ్ చేయడం వెనుక కూడా ఒక స్పష్టమైన వ్యూహం కనిపిస్తోంది. తెలుగు- తమిళ భాషల్లో ఒకేసారి సినిమా చేయడం ద్వారా రెండు మార్కెట్లను టార్గెట్ చేయడం ఈ బ్యానర్ ప్లానింగ్‌లో భాగమని చెప్పవచ్చు.
క్వాలిటీకి ప్రధాన్యమిస్తున్న ధృవ్
ధృవ్ విక్రమ్ కెరీర్‌ను పరిశీలిస్తే, అతను వేగంగా సినిమాలు చేయడం కంటే, సెలెక్టివ్‌గా కథలను ఎంచుకుంటున్నాడనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. క్వాలిటీకి ప్రాధాన్యం ఇస్తూ, ప్రతి సినిమా తన కెరీర్‌కు మరింత విలువను తీసుకురావాలనే దృక్పథంతో ముందుకు సాగుతున్నాడు. ఈ కారణంతోనే గతంలో పలువురు తెలుగు దర్శకులు కథలు చెప్పినా, అవి ఫైనల్ కాలేకపోయినట్టు సమాచారం. ఇదిలా ఉంటే, గతంలో మిస్ అయిన తెలుగు ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. వివిధ దర్శకులతో చర్చలు జరిగినప్పటికీ, సరైన స్క్రిప్ట్ దొరకకపోవడం వల్లే అవి ఆగిపోయాయని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఇప్పుడు మైత్రి బ్యానర్‌తో ఫైనల్ అయిన ఈ ప్రాజెక్ట్, ధృవ్‌కు సరైన ప్లాట్‌ఫామ్‌గా మారే అవకాశముంది.
విక్రమ్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్
ఈ సినిమా ద్విభాషా రూపంలో తెరకెక్కనుండటం కూడా ప్రత్యేకత. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో పాన్ సౌత్ ట్రెండ్ బలంగా కొనసాగుతున్న నేపథ్యంలో, ఒకేసారి రెండు మార్కెట్లను టార్గెట్ చేయడం నిర్మాతల వ్యూహంలో కీలకంగా మారింది. ఈ క్రమంలో ధృవ్ సినిమా కూడా అదే దారిలో నడవనుంది. ఇక కెరీర్ పరంగా ఇది ధృవ్ విక్రమ్‌కు ఒక టర్నింగ్ పాయింట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ మార్కెట్‌లో మంచి స్థానం సంపాదించగలిగితే, అతని భవిష్యత్ ప్రాజెక్ట్స్‌కు మరింత విలువ పెరుగుతుంది. ప్రత్యేకంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంది.
తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ వార్త ట్రెండ్ అవుతుండగా, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మొత్తానికి స్టార్ కిడ్స్ ఇతర ఇండస్ట్రీల్లో ఎంట్రీ ఇవ్వడం, పాన్ ఇండియా కల్చర్ పెరగడం వంటి ట్రెండ్స్ మధ్య ధృవ్ విక్రమ్ టాలీవుడ్ ఎంట్రీ ఒక ప్రాధాన్యమైన అడుగుగా నిలుస్తోంది. సరైన కంటెంట్‌తో వస్తే, ఈ ప్రాజెక్ట్ అతని కెరీర్‌ను కొత్త దిశలోకి తీసుకెళ్లే ఛాన్సుంది.
