Begin typing your search above and press return to search.

నాగ చైతన్య దూత తగ్గేదేలే.. టాప్ పొజిషన్ తో నయా రికార్డ్

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. టాప్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   24 Dec 2023 6:35 PM GMT
నాగ చైతన్య దూత తగ్గేదేలే.. టాప్ పొజిషన్ తో నయా రికార్డ్
X

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. టాప్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, నాని, నిఖిల్‌లు పాన్ ఇండియా స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు.


అయితే వీరందరిదీ ఒక ఎత్తు అయితే.. అక్కినేని వారసుడు నాగచైతన్య ఇంకో ఎత్తు.. సినిమాల ద్వారా రాని గుర్తింపు ఆయనకు దూత వెబ్‌ సిరీస్‌తో వచ్చేసింది. దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా దూత రికార్డులు సృష్టిస్తోంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ తెరకెక్కిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో అనేక రోజులుగా నెంబర్ 1 పొజిషన్ లో ట్రెండ్ అవుతోంది.

తాజాగా ఈ వెబ్ సిరీస్ మరో అరుదైన ఘనత సాధించింది. డిసెంబర్ మూడో వారం(15-21)లో టాప్ 10 ఓటీటీ ఒరిజినల్స్ లో అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల పొందిన లోకీ, ది రైల్వే మెన్ వెబ్ సిరీస్ ను వెనక్కి నెట్టి తొలిస్థానం కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని పాపులర్ ఓర్మాక్స్ ఓటీటీ ఆడియెన్స్ రిపోర్ట్ తెలిపింది. దూత తర్వాత స్థానంలో ది ఫ్రీలాన్సర్ సిరీస్ ఉంది.

విక్రమ్ కుమార్ రచించిన ఈ సిరీస్ ను తెలుగు నిర్మాత శరత్‌ మరార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ నిర్వాహకలు దాదాపు 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించారు. ఇందులో పార్వతీ తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచి దేశాయ్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్‌ 40 నిమిషాల నిడివితో ఉంటుంది.

డిసెంబర్‌ 1వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది దూత. సూపర్ నాచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌ అమెజాన్ ప్రైమ్‌లోని 38 భాషల్లో సబ్‌ టైటిల్స్‌తో దాదాపు 240 దేశాల్లో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

దూత కొత్త రికార్డుతో నాగచైతన్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇలాంటి సిరీస్‌లు మరిన్ని చేయాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ సినిమా చేస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. చైతన్య జాలరిగా కనిపించనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.