ధూమ్-4లో తెలుగు హీరో.. హహహ
నాగార్జున అప్పుడప్పుడూ ప్రత్యేక పాత్రలు చేస్తూ వచ్చాడు కానీ.. హీరోగా మాత్రం అక్కడ నిలదొక్కుకోలేదు.
By: Garuda Media | 20 Aug 2025 1:00 AM ISTతెలుగు హీరోలకు బాలీవుడ్లో వెలిగిపోవాలన్న ఇప్పటిది కాదు. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఇలా చాలామంది స్టార్లు అక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ ఎవ్వరికీ అక్కడ కలిసి రాలేదు.
నాగార్జున అప్పుడప్పుడూ ప్రత్యేక పాత్రలు చేస్తూ వచ్చాడు కానీ.. హీరోగా మాత్రం అక్కడ నిలదొక్కుకోలేదు. మిగతా వాళ్లకు పూర్తిగా చేదు అనుభవమే మిగిలింది. కొత్త తరంలోకి వస్తే రామ్ చరణ్ ‘జంజీర్’తో, ప్రభాస్ ‘ఆదిపురుష్’తో బాలీవుడ్లో వెలిగిపోవాలని చూశారు. కానీ వారికీ దారుణమైన అనుభవమే మిగిలింది.
ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌కు ‘వార్-2’ చిత్రంతో ఎదురు దెబ్బ తగిలింది. ఈ అనుభవాలు చూశాక ఇంకో తెలుగు హీరో ఎవరైనా.. హిందీలో హీరోగా నటించే సాహసం చేస్తాడా? కానీ ‘వార్-2’ను ప్రొడ్యూస్ చేసిన యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లు.. మరో తెలుగు హీరో కోసం ఎదురు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
యశ్ రాజ్ సంస్థకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘ధూమ్’ సిరీస్‌లో నాలుగో సినిమా తీయాలన్నది ఎన్నో ఏళ్ల ఆలోచన. ‘ధూమ్-3’లో ఆమిర్ ఖాన్ హీరోగా నటించగా.. సల్మాన్ లేదా షారుఖ్‌తో 'ధూమ్-4' చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ చివరికి రణబీర్ కపూర్‌తో ఈ సినిమా చేయాలని అనుకున్నారు.
ఐతే ఈ సారి ఒక్క హీరో కాకుండా ఇద్దరు సూపర్ స్టార్లను లీడ్ రోల్స్‌లో తీసుకోవాలన్నది వారి ప్రణాళిక. ఒకరు సౌత్ సూపర్ స్టార్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. ప్రభాస్ కోసం ప్రయత్నించినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి.
కానీ అతను నో చెప్పినట్లున్నాడు. తెలుగు నుంచి మరో స్టార్ హీరో ఎవరైనా దొరుకుతారా అని చూస్తున్నట్లుగా బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ‘వార్-2’ అనుభవం తర్వాత ఇది సరైన ఆలోచనగా అనిపించదు. వాళ్లకూ ఇది కలిసొచ్చే కాంబినేషన్ కాదు. అదే సమయంలో ఇక్కడి హీరోలు కూడా ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తారా అన్నది ప్రశ్న.
