Begin typing your search above and press return to search.

ఆస్కార్స్ లెజెండ్స్‌లోని 300 పేర్ల‌లో ధ‌ర్మేంద్ర మిస్సింగ్ వెన‌క‌

ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల వేడుకలో భారతీయ సినీ దిగ్గజం ధర్మేంద్రకు జరిగిన అవమానంపై ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

By:  Sivaji Kontham   |   19 March 2026 7:52 AM IST
ఆస్కార్స్ లెజెండ్స్‌లోని 300 పేర్ల‌లో ధ‌ర్మేంద్ర మిస్సింగ్ వెన‌క‌
X

ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల వేడుకలో భారతీయ సినీ దిగ్గజం ధర్మేంద్రకు జరిగిన అవమానంపై ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆస్కార్ వేడుకలో ప్రతి ఏడాది మరణించిన సినీ ప్రముఖులకు నివాళులర్పించే ఇన్ మెమోరియం విభాగం ఉంటుంది. అయితే ఈసారి విడుదల చేసిన 300 మంది లెజెండ్స్ జాబితాలో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ధర్మేంద్ర పేరును అకాడమీ విస్మరించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. భారతీయ అభిమానులతో పాటు సినీ విశ్లేషకులు కూడా జూరీ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.

ధర్మేంద్ర వంటి ఒక లెజెండరీ నటుడి పేరును జాబితాలో చేర్చకపోవడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు అపారమని అలాగే ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సామాన్యమైనది కాదని నెటిజన్లు గుర్తు చేశారు. జూరీపై తీవ్రమైన ఒత్తిడి, విమర్శలు పెరగడంతో అకాడమీ దిద్దుబాటు చర్యలకు దిగింది. నిరసనలను పరిగణనలోకి తీసుకున్న నిర్వాహకులు చివరికి ధర్మేంద్ర పేరును ఆ నివాళి జాబితాలో తిరిగి చేర్చారు.

ఈ మొత్తం వ్యవహారంపై ధర్మేంద్ర సతీమణి .. ప్రముఖ నటి హేమ మాలిని తీవ్రంగా స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అకాడమీ వైఖరిని తప్పుబట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మనసు గెలుచుకున్న ఒక గొప్ప నటుడిని గుర్తించకపోవడం నిజంగా సిగ్గుచేటు అని ఆమె వ్యాఖ్యానించారు. ధర్మేంద్ర గారు కేవలం భారత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోటా గుర్తింపు పొందిన వ్యక్తి అని అటువంటి వారిని విస్మరించడం వారి అజ్ఞానాన్ని సూచిస్తుందని ఘాటుగా విమ‌ర్శించారు.

అకాడమీ ప్రొడ్యూసర్లు ఈ లోపాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసినా కానీ.. అభిమానులు మాత్రం సంతృప్తి చెందలేదు. ప్రతి ఏటా ఇన్ మెమోరియం విభాగంలో కొంతమంది పేర్లు మిస్ అవ్వడం వివాదాలకు కారణమవుతూనే ఉంది. అయితే ధర్మేంద్ర వంటి స్థాయి ఉన్న నటుడి విషయంలో ఇలాంటి పొరపాటు జరగడం అకాడమీ విశ్వసనీయతను దెబ్బతీస్తుందని సినీ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. కేవలం హాలీవుడ్ కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఇతర దేశాల దిగ్గజాలను తక్కువ చేసి చూడటం సరికాదని విమర్శిస్తున్నారు.

ఏది ఏమైనా చివరికి ధర్మేంద్ర పేరును జాబితాలో చేర్చడం ఒక ఊరటనిచ్చే విషయమే అయినా.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అభిమానులు కోరుతున్నారు. భారతీయ సినిమా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న ఈ తరుణంలో మన స్టార్లకు దక్కాల్సిన గౌరవం విషయంలో రాజీ పడకూడదని హేమ మాలిని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సంఘటన ఆస్కార్ నిర్వాహకులకు ఒక గుణపాఠం లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు.