Begin typing your search above and press return to search.

'ధనుష్‌ 50' టైటిల్ & ఫస్ట్‌ లుక్‌.. గుండు లుక్ అదిరింది సార్!

తన స్వీయ దర్శకత్వంలో మైలురాయి 50వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు

By:  Tupaki Desk   |   19 Feb 2024 3:03 PM GMT
ధనుష్‌ 50 టైటిల్ & ఫస్ట్‌ లుక్‌.. గుండు లుక్ అదిరింది సార్!
X

నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ నటుడిగానే కాకుండా.. నిర్మాతగా, దర్శకుడుగా, గీత రచయితగా, నేపథ్య గాయకుడుగా మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నారు. 2017లో 'పవర్ పాండి' అనే సినిమాతో డైరెక్టర్ గా మారిన వర్సటైల్ యాక్టర్.. డెబ్యూతోనే మంచి హిట్టు కొట్టారు. ఏడేళ్ళ తర్వాత మళ్లీ ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకున్నారు. తన స్వీయ దర్శకత్వంలో మైలురాయి 50వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ధనుష్ ల్యాండ్ మార్క్ గోల్డెన్ జూబ్లీ సినిమాకి ''రాయన్'' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తమిళంతో పాటుగా తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పటికే ధనుష్ గుండు చేయించుకుని వెనక్కి తిరిగి నిలబడి ఉన్న ఓ పిక్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫుల్ లుక్ ని రివీల్ చేసి ఆడియన్స్ లో ఆసక్తిని రెట్టింపు చేశారు.

''రాయన్'' ఫస్ట్ లుక్ పోస్టర్ లో ధనుష్ చేతిలోఒక ఆయుధాన్ని పట్టుకొని ఇంటెన్స్ గా చూస్తూ నిలబడి ఉన్నారు. ఇందులో అతనితో పాటుగా టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, మలయాళ నటుడు కాళిదాస్ జయరాం కూడా చేతుల్లో కత్తులు పట్టుకొని కోపంగా చూస్తూ ఉన్నారు. ఈ సెటప్ అంతా చూస్తుంటే వీరు ముగ్గురూ ఏదో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ రన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే చేతుల్లో ఆయుధాలు పట్టుకొని ఉండటాన్ని బట్టి చూస్తే మాత్రం, ఈ ముగ్గురి వెనుక ఏదో బలమైన కథ ఉన్నట్లు అనిపిస్తుంది. మొత్తం మీద ధనుష్ న్యూ లుక్ అందరినీ ఆకట్టుకునేలా వుంది.

'రాయన్' సినిమాకి ధనుష్ కథ రాయడమే కాదు, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఓం ప్రకాశ్ సినిమాటోగ్రాఫర్ గా, ప్రసన్న ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సినిమాకి శ్రేయాస్ శ్రీనివాసన్ ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇందులో ధనుష్, సందీప్ కిషన్, కాళిదాస్ లతో పాటుగా మరికొందరు స్టార్ క్యాష్టింగ్ భాగం కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎస్ జె సూర్య విలన్ పాత్ర పోషిస్తారని.. నిత్యా మీనన్, అపర్ణ బాలమురళి, అనికా సురేంద్రన్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీలో నటించే ఇతర ప్రధాన నటీనటుల వివరాలను వెల్లడించనున్నారు.

2002లో హీరోగా కెరీర్‌ ప్రారంభించిన ధనుష్‌.. డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. 'సార్' చిత్రంతో నేరుగాటాలీవుడ్ లో అడుగుపెట్టిన విలక్షణ నటుడు.. ఇటీవల 'కెప్టెన్ మిల్లర్' మూవీతో ప్రేక్షకులని పలకరించారు. ఇప్పుడు 'రాయన్' గా రాబోతున్నారు. ఈ సినిమాని 2024లోనే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతోపాటుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో DNS మూవీ చేస్తున్నారు ధనుష్. ఇందులో కింగ్ అక్కినేని నాగార్జున స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు.