ఇది ధనుష్‌కు మాత్రమే సొంతమైన ఘనత
ఒక స్టార్ హీరో నుంచి ఒకే ఏడాది మూడు సినిమాలు రిలీజ్ కావడమే అరుదైన విషయం.
By: Tupaki Desk | 3 Dec 2025 5:00 AM ISTఒక స్టార్ హీరో నుంచి ఒకే ఏడాది మూడు సినిమాలు రిలీజ్ కావడమే అరుదైన విషయం. అలాంటిది వేర్వేరు భాషల్లో ఆ మూడు సినిమాలు చేయడం.. ఆ మూడూ ఆయా భాషల్లో విజయవంతం కావడం ఇంకా అరుదైన ఘనతే. తమిళ స్టార్ హీరో ధనుష్‌కు ఈ రికార్డు సొంతమైంది. అతను ఈ ఏడాది జూన్‌లో ‘కుబేర’ చిత్రంతో పలకరించాడు. ‘సార్’ తర్వాత అతను చేసిన రెండో తెలుగు చిత్రమిది. శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ చిత్రం తెలుగులో మంచి విజయం సాధించింది. తమిళంలో మాత్రం ‘కుబేర’ సరిగా ఆడలేదు.
ఆ తర్వాత ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇడ్లీ కడై’ సినిమా అక్టోబరు మొదటి వారంలో రిలీజైంది. ఆ చిత్రం తెలుగులో కూడా విడుదలైనప్పటికీ.. ఇక్కడ సరిగా ఆడలేదు. కానీ ధనుష్ సొంత భాష అయిన తమిళంలో పెద్ద హిట్టే అయింది. ఓటీటీలోకి వచ్చాక ఈ సినిమాకు మరింత ఆదరణ దక్కింది. దర్శకుడిగా వరుసగా నాలుగో చిత్రంతోనూ అతను సక్సెస్ అందుకున్నాడు.
ఇప్పుడిక ‘తేరే ఇష్క్ మే’ సినిమాతో ధనుష్ హిందీలో కూడా జయకేతనం ఎగురవేశాడు. తనకు ‘రాన్‌జానా’ రూపంలో మరపురాని సినిమాను అందించిన ఆనంద్.ఎల్.రాయ్ దర్శకత్వంలో ధనుష్ నటించిన చిత్రమిది. కృతి సనన్ కథానాయిక. ఇంటెన్స్ టీజర్, ట్రైలర్‌లతో ఆకట్టుకున్న ‘తేరే ఇష్క్ మే’ గత శుక్రవారమే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు, టాక్ వచ్చాయి.
తొలి రోజు ఇండియాలో రూ.15 కోట్ల నెట్ వసూళ్లతో ‘తేరే ఇష్క్ మే’ మంచి ఓపెనింగ్ వచ్చింది. తర్వాతి రెండు రోజుల్లోనూ ఈ సినిమా కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. ఫస్ట్ వీకెండ్లో ఇండియా వరకే హాఫ్ సెంచరీ కొట్టింది ‘తేరే ఇష్క్ మే’. వీకెండ్ తర్వాత కూడా సినిమాకు మంచి రెస్పాన్సే వస్తోంది. ధనుష్‌కు బాలీవుడ్లో మరో హిట్ పడిందన్నది స్పష్టం. ఈ సినిమాలో తన నటనకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ఇలా ఒకే ఏడాది ఒక హీరో మూడు భాషల్లో హిట్లు కొట్టడం ఒక రికార్డని చెప్పొచ్చు. దీన్ని ఇంకెవ్వరూ బద్దలు కొట్టలేరేమో.
