ఒకే ఫ్రేమ్ లో ధనుష్ శింబు.. బిగ్గెస్ట్ సర్ ప్రైజ్ అవుతుందా?
అందుకే వీరిద్దరూ ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుందా అనే చర్చ చాలా ఏళ్లుగా అభిమానుల్లో కొనసాగుతోంది.
By: M Prashanth | 4 Jun 2026 8:00 AM ISTకోలీవుడ్ లో ధనుష్, శింబు పేర్లు వినగానే అభిమానులకు గుర్తొచ్చేది వారి సినిమాలు మాత్రమే కాదు.. కొన్నేళ్లుగా ఉన్న బాక్సాఫీస్ పోటీ కూడా. ఇద్దరూ ఒకే టైమ్ లో హీరోలుగా ఎదిగి తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. దాదాపు 20 ఏళ్లుగా వీరిద్దరూ తమదైన శైలిలో స్టార్ డమ్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. ఒకరు యాక్టింగ్ తో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకోగా, మరొకరు మాస్ ఇమేజ్ తో స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు.
అందుకే వీరిద్దరూ ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుందా అనే చర్చ చాలా ఏళ్లుగా అభిమానుల్లో కొనసాగుతోంది. ఇప్పుడు అది నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో శింబు హీరోగా తెరకెక్కుతున్న అరసన్ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ మూవీ వడ చెన్నై వరల్డ్ కు సంబంధించిన స్టోరీతో రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు ఆ మూవీలో ధనుష్ కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందనే వార్తలు అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నాయి. వడ చెన్నైలో ధనుష్ పోషించిన అన్బు పాత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన సీన్ అరసన్ కథతో లింక్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే ఫ్యూచర్ లో వెట్రిమారన్ రూపొందించే కథలకు ఇది మెయిన్ లింక్ గా మారొచ్చని తెలుస్తోంది. దీనిపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
నిజానికి ధనుష్, శింబు కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకోవడం అభిమానులకు కొత్త విషయం కాదు. గతంలో ధనుష్ నిర్మించిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ కాకా ముట్టైలో శింబు గెస్ట్ రోల్ లో కనిపించారు. అయితే ఇద్దరూ కలిసి పూర్తి స్థాయి పాత్రల్లో నటించిన మూవీ మాత్రం ఇప్పటివరకు రాలేదు. అందుకే ఇప్పుడు వస్తున్న వార్తలు మరింత వైరల్ అవుతున్నాయి. ఆ కాంబో నిజమైతే కోలీవుడ్ లో భారీ మల్టీస్టారర్ గా నిలిచే అవకాశం ఉంది.
ధనుష్ కు ఉన్న యాక్టింగ్ టాలెంట్, ఎమోషన్ సీన్స్ లో చూపించే నేచురాలిటీ ఓవైపు ఉంటే.. శింబు స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ డైలాగ్ డెలివరీ మరో వైపు ఉంటుంది. ఇప్పుడు ఆ ఇద్దరూ ఒకే కథలో భాగమైతే ఆడియన్స్ కు కొత్త ఎక్స్పీరియన్స్ పక్కా. ముఖ్యంగా వెట్రిమారన్ సినిమాల్లో పాత్రలకు ఉండే బలం, కథలో కనిపించే రియాలిటీ కారణంగా ఆ కాంబినేషన్ పై ఆసక్తి మరింత పెరుగుతోంది. గ్యాంగ్ స్టర్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ధనుష్, శింబు నటించిన సీన్స్ ఉంటే అవి అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ గా మారనున్నాయి.
అయితే కోలీవుడ్ తోపాటు టాలీవుడ్ లో కూడా ఆ ఇద్దరు హీరోలకు మంచి మార్కెట్ ఉంది. అందుకే వీరిద్దరూ కలిసి నటిస్తే సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా ఇప్పుడు వినిపిస్తున్నవి కేవలం రూమర్లే. ధనుష్ నిజంగా అరసన్ లో కనిపిస్తారా లేదా అన్నది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత క్లారిటీ రానుంది. అప్పటివరకు ఆ విషయం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చగానే కొనసాగనుంది.
