Begin typing your search above and press return to search.

'కుబేర' ఆ మల్టీప్లెక్స్‌ల్లో విడుదల లేదు.. కారణం ఇదే!

తెలుగు, తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'కుబేర' సినిమా విడుదలకు సిద్ధం అయింది.

By:  Tupaki Desk   |   13 Jun 2025 11:56 AM IST
కుబేర ఆ మల్టీప్లెక్స్‌ల్లో విడుదల లేదు.. కారణం ఇదే!
X

తెలుగు, తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'కుబేర' సినిమా విడుదలకు సిద్ధం అయింది. ధనుష్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను జూన్‌ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. టాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ నాగార్జున కీలక పాత్రలో నటించగా, నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో ధనుష్‌ బిచ్చగాడిగా కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ధనుష్ వంటి స్టార్‌ హీరో ఆ పాత్రకు ఒప్పుకోవడం అంటే మామూలు విషయం కాదు. కథ ఏ స్థాయిలో ఉంటుందో ఊహకు సైతం అందడం లేదు అంటూ సినీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుతూ ఉన్నారు.

సుదీర్ఘ వాయిదాల పర్వం తర్వాత విడుదలకు రెడీ అయిన కుబేర సినిమాను ఇంకా కూడా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ సినిమా పోస్ట్‌ థియేట్రికల్‌ రిలీజ్ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌ వీడియో తీసుకుంది. థియేట్రికల్‌ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కాబోతుంది. అయితే ఇదే సినిమాకు పెద్ద సమస్య ను తెచ్చి పెట్టింది. ఈమధ్య కాలంలో నార్త్‌ ఇండియాలో ఓటీటీల ప్రభావం తగ్గించడం కోసం కొన్ని మల్టీప్లెక్స్‌లు నింబధన తీసుకు వచ్చాయి. ఆ నిబంధన ప్రకారం థియేట్రికల్‌ రిలీజ్ అయిన ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్‌కి అనుమతించాలి. ఈ నిబంధన కారణంగా కుబేర సినిమా ఆయా మల్టీప్లెక్స్‌లో విడుదల కావడం లేదు.

ధనుష్ కి నార్త్‌ ఇండియాలో ఉన్న మార్కెట్‌, క్రేజ్‌ నేపథ్యంలో కుబేర సినిమాను అక్కడ పెద్ద ఎత్తున విడుదల చేయాలని భావించారు. కానీ అది సాధ్యం కావడం లేదు. పీవీఆర్‌, ఐనాక్స్‌, సినీపోలీస్‌ వంటి మల్టీప్లెక్స్‌ లు 8 వారాల ఓటీటీ గడువు ఉంటేనే స్క్రీనింగ్‌కు ఒప్పుకుంటున్నాయి. కుబేర హిందీ వర్షన్‌ను సింగిల్‌ స్క్రీన్స్‌లో మాత్రమే ప్రేక్షకులు చూసే వీలు ఉంటుంది. ఆ మూడు మల్టీప్లెక్స్‌ల్లో విడుదల చేయాలంటే ఏ సినిమా అయినా ఓటీటీ స్ట్రీమింగ్‌ 8 వారాల తర్వాత చేస్తామని ముందుగానే ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కుబేర నిర్మాతలు నాలుగు వారాలకే స్ట్రీమింగ్‌ చేసుకోవచ్చు అంటే అమెజాన్‌కి ఒప్పందం ఇచ్చింది.

రష్మిక మందన్నతో పాటు అనుపమ్ ఖేర్‌ నటించిన ఈ సినిమాకు హిందీ మార్కెట్‌లో మంచి బజ్‌ ఉంది. కానీ మల్టీప్లెక్స్‌లో సినిమాను విడుదల చేసేందుకు వీలు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. సౌత్‌లో ముఖ్యంగా తెలుగు, తమిళ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఇలాంటి సమయంలో హిందీలో కూడా అత్యధిక స్క్రీన్స్‌లో రిలీజ్‌ అయితే భారీ ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉంది. కానీ 8 వారాల నిబంధన కారణంగా అక్కడ ఎక్కువగా విడుదల చేయలేక పోతున్నారు. ఇది ఖచ్చితంగా నిర్మాతలకు నష్టంను మిగిల్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.