ధనుష్‌కు నేషనల్ అవార్డ్ రాసిచ్చేసిన చిరు
కొన్ని నెలల కిందటే 2024 సంవత్సరానికి జాతీయ అవార్డులను ప్రకటించారు. ఈ ఏడాది అవార్డుల ప్రకటనకు ఇంకా చాలా సమయం ఉంది.
By: Tupaki Desk | 23 Jun 2025 12:59 PM ISTకొన్ని నెలల కిందటే 2024 సంవత్సరానికి జాతీయ అవార్డులను ప్రకటించారు. ఈ ఏడాది అవార్డుల ప్రకటనకు ఇంకా చాలా సమయం ఉంది. వచ్చే ఏడాది ఆరంభంలో వాటిని ప్రకటిస్తారు. కానీ చాలా ముందుగానే 2025 సంవత్సరానికి తమిళ నటుడు ధనుష్‌ను జాతీయ ఉత్తమ నటుడిగా ప్రకటించేశారు మెగాస్టార్ చిరంజీవి. ధనుష్ లీడ్ రోల్ చేసిన ‘కుబేర’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్లకు ముఖ్య అతిథిగా హాజరైన చిరు.. అతడి మీద ప్రశంసల జల్లు కురిపించాడు.
ధనుష్‌కు అవార్డులు అందుకోవడం కొత్త కాదని.. తన లాంటి వాళ్లు జాతీయ అవార్డు వస్తే ఎక్కువ సంబర పడతాం కానీ, ధనుష్‌కు మాత్రం అది మామూలు విషయమని వ్యాఖ్యానించారు. అయినా సరే.. ‘కుబేర’ చిత్రానికి మరోసారి అతను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకుంటాడని.. అతడికి పురస్కారం ఇవ్వకపోతే జాతీయ అవార్డులకు అర్థం లేదని చిరు కామెంట్ చేయడం విశేషం.
దేవా పాత్రలో ధనుష్ అంత గొప్పగా నటించాడని.. అతణ్ని తప్ప ఈ పాత్రలో ఎవ్వరినీ ఊహించుకోలేమని.. ఎవ్వరూ తనలా నటించలేరని, మన దేశంలో ఈ పాత్ర చేయదగ్గ నటుడు ధనుష్ ఒక్కడే అని చిరు అన్నారు. శేఖర్ కమ్ముల దేవా పాత్రను రాసి దానికి ధనుష్‌ను ఎంచుకున్నారా.. లేక ధనుష్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ పాత్ర రాశారా అన్నది తనకు తెలియదని.. రెండోదే జరిగి ఉండొచ్చని చిరు అన్నారు.
ఇక నాగార్జున గురించి చిరు మాట్లాడుతూ.. తాను చేస్తున్నది తప్పా ఒప్పా అన్న సంఘర్షణలో ఉండే పాత్రలో ఆయన అద్భుతంగా నటించాడన్నారు. నాగ్ కెరీర్‌ను ఈ సినిమా కొత్త మలుపు తిప్పుతుందని.. ఆయనకు మరిన్ని వైవిధ్యమైన పాత్రలు వస్తాయని.. నాగ్‌ను చూసి తాను కూడా స్ఫూర్తి పొంది ఇలాంటి పాత్రలు చేయడానికి ప్రయత్నిస్తానని చిరు అన్నారు. 18 ఏళ్ల వయసులో తనను చూసి స్ఫూర్తి పొందినట్లుగా చెప్పిన శేఖర్ కమ్ముల.. ఇప్పుడు ఇంత గొప్ప స్థాయిలో ఉండడం తనకెంతో ఆనందంగా ఉందని చిరు వ్యాఖ్యానించారు.
