Begin typing your search above and press return to search.

`కర` ప్రీ-రిలీజ్: టైటిల్ మీనింగ్ ఏంటో చెప్పిన ధ‌నుష్‌

కోలీవుడ్ స్టార్ ధనుష్ కథానాయకుడిగా నటించిన `కర` (KARA) చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

By:  Sivaji Kontham   |   27 April 2026 12:14 AM IST
`కర` ప్రీ-రిలీజ్:  టైటిల్ మీనింగ్ ఏంటో చెప్పిన ధ‌నుష్‌
X

కోలీవుడ్ స్టార్ ధనుష్ కథానాయకుడిగా నటించిన `కర` (KARA) చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ఆదివారం(26 ఏప్రిల్) సాయంత్రం జరిగిన ప్రీ-రిలీజ్ వేడుకలో సాయిధ‌ర‌మ్- పెద్ది ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ప్ర‌త్యేక అతిథులుగా పాల్గొని సినిమా విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర క‌థానాయ‌కుడు ధనుష్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

సినిమా టైటిల్ `కర` అని ఉంటే అంద‌రూ కారా అని ప‌లుకుతున్నార‌ని ధ‌నుష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. కేవలం నాలుగు అక్షరాలు ఉన్న ఈ పేరును హీరోయిన్, నిర్మాతలు సహా అందరూ తప్పుగానే పలుకుతున్నారని ఆయన అన్నారు. అయితే పేరు ఏదైనా పర్వాలేదు కానీ.. ప్రేక్షకులు మాత్రం థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని ఆయన కోరారు. `కర` అంటే ఒక సామాన్య వ్యక్తి అసాధారణ పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు జరిగే పోరాటమని.. ఇది మనందరి హృదయాలకు దగ్గరైన కథ అని ధ‌నుష్ వివ‌రించారు.

దర్శకుడు విఘ్నేష్ రాజాను ధనుష్ ఆకాశానికెత్తేశారు. విఘ్నేష్ రాజా పేరును తెలుగు ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలని.. భవిష్యత్తులో అత‌డు పెద్ద స్థాయికి చేరుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. నిజానికి ఆయన పాత సినిమాను అభినందించడానికే విఘ్నేష్‌ను కలిశానని.. కానీ అత‌డిలోని ఎనర్జీ తనను ఎంతగానో ఆకర్షించడంతో వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నానని ధనుష్ వెల్లడించారు. సహనటి మ‌మితా, సీనియర్ నటుడు జయరామ్ , కేఎస్ ర‌వికుమార్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని.. అలాగే తన ప్రాణమిత్రుడు జీవీ ప్రకాష్ మరోసారి అద్భుతమైన సంగీతాన్ని అందించారని ప్రశంసించారు.

వేదికపై అతిథులుగా వచ్చిన సాయి ధరమ్ తేజ్ - బుచ్చిబాబులకు ధనుష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తోటి నటుడి సినిమాను ప్రోత్సహించడానికి వచ్చిన తేజ్ గొప్ప మనసును..షూటింగ్‌లో బిజీగా ఉన్నా సమయం కేటాయించిన బుచ్చిబాబును ఆయన అభినందించారు. ఇదే క్రమంలో దర్శకుడు వెంకీ అట్లూరిని తన సోదరుడిగా పేర్కొంటూ..ఇప్ప‌టికే వినిపించిన‌ కథతో మళ్ళీ తన వద్దకు రావాలని.. మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని బహిరంగంగానే హింట్ ఇచ్చారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిన `కర` చిత్రాన్ని ఏప్రిల్ 30న థియేటర్లలో చూసి ఆదరించాలని ధనుష్ కోరారు. వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు. ధనుష్ ప్రసంగం అంతా వినమ్రతతో.. తోటి కళాకారుల ప‌ట్ల‌ గౌరవంతో సాగడం అభిమానులను ఖుషీ చేసింది.