ధనుష్ 'కర' ప్రీరిలీజ్: టైటిల్ `కర` వెనుక కారా మాస్టార్ కథ చెప్పిన బుచ్చిబాబు!
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం `కరా` (KARA) ప్రీ-రిలీజ్ వేడుకలో దర్శకుడు బుచ్చిబాబు సానా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
By: Sivaji Kontham | 27 April 2026 12:14 AM ISTతమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం `కరా` (KARA) ప్రీ-రిలీజ్ వేడుకలో దర్శకుడు బుచ్చిబాబు సానా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం తాను దర్శకత్వం వహిస్తున్న `పెద్ది` సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నా.. కేవలం ధనుష్‌పై ఉన్న అభిమానంతో సెట్స్ నుంచి నేరుగా ఈ కార్యక్రమానికి వచ్చానని ఆయన వెల్లడించారు. ధనుష్ నటనకు తాను వీరాభిమానినని ..రాంజనా సినిమా తనకు ఎంతో నచ్చిన చిత్రమని.. నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన `ఆడుకళం`సాంగ్‌లో ధనుష్ చేసిన డాన్స్ తనను ఎంతగానో ప్రభావితం చేశాయని బుచ్చిబాబు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
ముఖ్యంగా ఈ చిత్రానికి `కర` అని పేరు పెట్టడం వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపథ్యాన్ని బుచ్చిబాబు వివరించారు. విశాఖపట్నానికి చెందిన ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు గారిని అందరూ గౌరవంగా `కారా మాస్టర్` అని పిలుస్తారని, తన ఆస్తిని ఇంటిని సైతం సాహిత్య సేవ కోసం ధారపోసి గొప్ప గ్రంథాలయాన్ని నిర్మించిన మహనీయుడు ఆయన అని కొనియాడారు. తెలుగులో పుట్టిన ప్రతి కథా ఆ గ్రంథాలయంలో లభిస్తుందని.. అటువంటి గొప్ప వ్యక్తి పేరుతో ఈ సినిమా రావడం ఎంతో విశేషమని ఆయన పేర్కొన్నారు. ఈ టైటిల్ వెనుక ఉన్న సాహిత్య అనుబంధం సినిమాపై గౌరవాన్ని పెంచిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ధనుష్ డెడికేషన్ గురించి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వయంగా తనతో మాట్లాడిన విషయాలను బుచ్చిబాబు ఈ వేదికపై పంచుకున్నారు. `రాయన్` వంటి సినిమాల సమయంలో ధనుష్ పనితీరు- అంకితభావం గురించి రెహమాన్ ఎంతో గొప్పగా చెప్పేవారని గుర్తుచేశారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..తన తదుపరి చిత్రం `పెద్ది`ని జూన్ 25న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చారు. ధనుష్ వంటి గ్లోబల్ స్టార్‌కు తెలుగులో లభిస్తున్న ఆదరణ చూస్తుంటే సంతోషంగా ఉందని ఆయన ముగించారు.
ధనుష్ నటించిన కర ఏప్రిల్ 30న తెలుగు థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే తమిళ, తెలుగు ..విదేశీ మార్కెట్లలో మంచి ఆదరణ పొందింది. ఈ తెలుగు వెర్షన్‌ను విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్‌తో కలిసి పంపిణీ చేస్తోంది. దీనితో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం విస్తృతంగా విడుదల కానుంది. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్‌పై డాక్టర్ ఇషారి కె. గణేష్, థింక్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించారు. ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించగా, జయరామ్, కె.ఎస్. రవికుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
