ధనుష్ మూవీ సెట్స్ లో భారీ ప్రమాదం.. అసలేం జరిగిందంటే
తమిళ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న సినిమా ఇడ్లీ కడై. ధనుష్ దర్శకత్వంలో వస్తున్న నాలుగో సినిమా ఇది.
By: Tupaki Desk | 20 April 2025 1:34 PM ISTతమిళ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న సినిమా ఇడ్లీ కడై. ధనుష్ దర్శకత్వంలో వస్తున్న నాలుగో సినిమా ఇది. ఈ సినిమాను డాన్ పిక్చర్స్ బ్యానర్ లో ధనుష్, ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఇడ్లీ కడై సినిమా షూటింగ్ థేని, పొల్లాచ్చి లాంటి ప్రాంతాల్లో జరుగుతోంది.
వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో పాటూ కొంత భాగం షూటింగ్ ను విదేశాల్లో చేయాల్సి రావడంతో ఇడ్లీ కడైను వాయిదా వేసి అక్టోబర్ 1న రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ప్రస్తుతం తేని జిల్లాలోని ఆండీపట్టీలో వేసిన స్పెషల్ సెట్స్ లో ఇడ్లీ కడైకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.
గత 20 రోజులుగా ఈ సినిమా షూటింగ్ ఆ సెట్స్ లోనే జరుగుతోంది. సినిమాలో కీలక నటీనటులంతా ఈ షూటింగ్ లో పాల్గొంటుండగా, ఇడ్లీ కడై షూటింగ్ సెట్స్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అనూహ్య రీతిలో సెట్స్ లో మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడ చెక్క వస్తువులతో పాటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఉండటం వల్ల ఆ మంటలు త్వరగా పెరిగి ప్రమాద తీవ్రత బాగా పెరిగింది.
సుమారు గంటన్నర పాటూ సెట్ మొత్తం తగలబడిందని, ఆ టైమ్ లో నటీనటులెవరూ అక్కడ లేకపోవడంతో చిత్ర యూనిట్ ఊపిరిపీల్చుకుంది. మంటలను గమనించిన వెంటనే ఫైర్ ఇంజన్ కు కాల్ చేసి మంటలు ఆర్పినప్పటికీ అప్పటికే 60 శాతానికి పైగా సెట్స్ కాలిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఇంత పెద్ద అగ్ని ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందా అని చిత్ర యూనిట్ ఆలోచిస్తుంది.
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అరుణ్ విజయ్, సత్యరాజ్, పార్తీబన్, ప్రకాష్ రాజ్, షాలినీ పాండే, సముద్రఖని, రాజ్‌కిరణ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. మరి ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఇడ్లీ కడైతో పాటూ ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర లో నటిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ లో కుబేర ప్రేక్షకుల ముందుకు రానుంది.
