యాక్టింగ్ - డైరెక్షన్... ధనుష్‌కి ఏది ఇష్టం?
హీరోగా నటించడం మాత్రమే కాకుండా దర్శకత్వం వహించడం ద్వారా హీరోల్లో తాను డిఫరెంట్ అని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నాడు.
By: Tupaki Desk | 18 Jun 2025 7:00 PM ISTఈతరం హీరోలు ఏడాదికి ఒక్క సినిమా సినిమాతో రావడం గగనంగా మారింది. ముఖ్యంగా స్టార్ హీరోలు ఏడాదిలో కనీసం ఒక్క సినిమాను విడుదల చేయలేక పోతున్నారు. అంత టైం తీసుకుని చేసిన సినిమాలు ఏమైనా సూపర్ హిట్ అవుతున్నాయా అంటే.. అదీ లేదు. సక్సెస్ రేటు కంటే ఫ్లాప్ రేటు ఎక్కువగా ఉంది. కానీ ఇతర హీరోలతో పోల్చితే ధనుష్ చాలా విభిన్నం. ఆయన ఏడాదికి రెండు సినిమాలకు తగ్గకుండా చేస్తున్నాడు. ఆయన నుంచి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. హీరోగా నటించడం మాత్రమే కాకుండా దర్శకత్వం వహించడం ద్వారా హీరోల్లో తాను డిఫరెంట్ అని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నాడు.
హీరోగా వరుస సినిమాలు చేస్తున్న ధనుష్ దర్శకత్వంపై మక్కువతో వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ధనుష్ దర్శకత్వంలో రూపొందిన 'నిలవకు ఎన్ మెల్ ఎన్నడి కోబం' సినిమా విడుదలైంది. దర్శకుడిగా ధనుష్ ఇడ్లీ కడై అనే సినిమాను ప్రస్తుతం చేస్తున్నాడు. ఆ సినిమాలో తానే హీరోగా నటిస్తున్నాడు. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేర సినిమాతో ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జూన్ 20న విడుదల కాబోతున్న కుబేర సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ధనుష్ తెలుగు, తమిళ మీడియాతో ముచ్చటించాడు. ఆ సమయంలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు.
ధనుష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తనకు హీరోగా నటించడం కంటే దర్శకుడిగా సినిమాలు చేయడం ఎక్కువ ఇష్టం అన్నాడు. తెర మీద కనిపించడం కంటే, కెమెరా వెనుక ఉండి సినిమాను రూపొందించడం ఇష్టం అన్నాడు. యాక్టింగ్, డైరెక్షన్‌లో ఒక్కటి ఎంపిక చేసుకోమన్నప్పుడు ధనుష్ పై విధంగా స్పందించాడు. దర్శకుడిగా సినిమాలు చేయాలని ఉన్నప్పటికీ తన అభిమానుల కోసం నటిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ముందు ముందు కూడా యాక్టింగ్ కొనసాగిస్తాను అన్నాడు. అయితే వీలును బట్టి దర్శకత్వం వహిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. రెగ్యులర్‌గా తన దర్శకత్వంలో వస్తాయని అభిమానులకు హామీ ఇచ్చాడు.
హీరోగా ధనుష్ చేసే సినిమాలకు తమిళనాడుతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు. అందుకే తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ధనుష్ సినిమాలు ఈ మధ్య కాలంలో అత్యధిక స్క్రీన్స్‌లో విడుదల అవుతున్నాయి. హీరోగా ధనుష్ ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాల్లో ఈ ఏడాది రెండు విడుదల కానుండగా, వచ్చే ఏడాది మరో రెండు మూడు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ధనుష్ హీరోగా వరుస సినిమాలు చేయడంతో పాటు, దర్శకుడిగా ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. కుబేర సినిమా సక్సెస్ అయితే శేఖర్ కమ్ములతో ధనుష్ మరో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.
